తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల సమీక్షలను పూర్తి చేసారు. రోజూ రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు, పలు అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్ష చేస్తున్నారు. అలాగే పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్ లో ఈ సమీక్షలకు నియోజకవర్గాలకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు బూత్ లెవల్ కన్వీనర్లు, ముఖ్య నేతలు హాజరవుతున్నారు. నియోజకవర్గాల్లో పోలింగ్ ఎలా జరిగింది? పోలింగ్ సరళి ఎలాఉంది.? టీడీపీకి విజయావశాలు ఎలా ఉండబోతున్నాయి.? పార్టీ బలాలేంటి? బలహీనతలు ఏంటి అనే అంశాలపై పార్టీ అభ్యర్థులను చంద్రబాబు అడిగి తెలుసుకుంటున్నారు.
బూత్ స్థాయి నుంచి ఎన్ని ఓట్లు వస్తాయన్న దానిపై చర్చిస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్స్ ఎంపిక, ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి వాటి విషయంలోనూ దిశానిర్దేశం చేస్తున్నారు. పోలింగ్ తీరు తెన్నులపై అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులిచ్చే నివేదికల ఆధారంగానే గెలుపు ఓటములపై సమీక్షలు చేస్తున్నారు. అయితే అక్కడికి వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్ధులకు, బూత్ లెవెల్ కన్వీనర్లకు కనీసం ఈ సమీక్షలు ఎందుకు చేస్తున్నారో, తామెందుకు హాజరవుతున్నామో కూడా అర్ధం కావట్లేదట. అలాగే చాలాచోట్ల తాము దారుణంగా ఓడిపోతామని తెలిసిన నియోజకవర్గాల అభ్యర్ధులతో కూడా చంద్రబాబు సమీక్షలు చేద్దాం కూర్చోండి అంటుండడంతో వారందరికి దిమ్మతిరిగిపోతుందట.. సీఎంగా ఉన్నప్పుడు మీటింగులు పెట్టి అధికారుల బుర్ర తినేవాడు ఇప్పుడు ఆపని లేకపోవడంతో మమ్మల్ని చంపుతున్నాడంటూ పలువురు అభ్యర్ధులే ఇక్కడ విసుక్కోవడం విశేషం. మరోవైపు వైసీపీ అధినేత మే 19వ తేదీన మాత్రం కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి పార్టీ నేతలతో మాత్రం సమావేశం పెట్టుకున్నారు.