టీవీ9 సంస్థను కొనుగోలు చేసిన అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు ఇచ్చిన కంప్లంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. రవిప్రకాష్‌పై ఫోర్జరీ, ఫైళ్లు మాయం, నిధుల దారి మళ్లింపుపై కౌశిక్ రావు కంప్లయింట్ చేశారు. అలాగే తన సంతకం ఫోర్జరీ చేశారని, నిధులను దారి మళ్లించారని ఫిర్యాదు చేశారు. 2019, మే 09వ తేదీన ఉదయమే ఫిర్యాదు చేయగా తెలంగాణ పోలీసులు టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీతో కలిసి కుట్ర పూరితంగా చర్యలకు పాల్పడి ఏబీసీఎల్ యాజమాన్యానికి, కంపెనీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడినట్లు అలందా మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాశ్ కోసం పోలీసులు గాలిస్తుండగా.. మరోవైపు తనకు వాటా ఉందంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన నటుడు శివాజీ ఇంట్లో కూడా పోలీసులు సోదాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే శివాజీ దురుద్దేశ పూర్వకంగా రవిప్రకాశ్‌తో కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా కంపెనీ నిర్వాహణలో ఇబ్బందులు కలిగించారని టీవీ9 యాజమాన్యం ఫిర్యాదులో వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే.. సినీనటుడు శివాజీ ఏప్రిల్ 19, 2019న హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్టీ)లో ఫిర్యాదు చేశారు. శివాజీ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం… ఏబీసీఎల్‌లో రవిప్రకాశ్‌కు 20 లక్షల షేర్లు అంటే 8 శాతం వాటా ఉంది. ఇందులోనుంచి 40 వేల షేర్లను కొనుగోలు చేసేందుకు రవి ప్రకాశ్‌కు రూ.20 లక్షల చెల్లించి ఫిబ్రవరి 20, 2018న ఒప్పందం కుదుర్చుకున్నానని, ఈ ఒప్పందం జరిగిన ఏడాదిలోగా షేర్లను తన పేరు మీద బదిలీ చేసేందుకు రవిప్రకాశ్ అంగీకరించారని, తాను అతని మీద నమ్మకం ఉంచానని శివాజీ అందులో తెలిపారు. ఈ అనుమానాల వల్లే, శివాజీ, రవిప్రకాశ్ మధ్య కుదిరనట్లు చెప్తున్న ఒప్పొందం.. ఫోర్జరీ ఒప్పందంగా టీవీ9 కొత్త యాజమాన్యం చెబుతుంది. కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు కలిగించే ఉద్దేశ్యంతో రవిప్రకాశ్, శివాజీతో కలిసి కుమ్మక్కై ఈ నాటకానికి తెర తీశారని ఏబీసీఎల్ కొత్త యాజమాన్యం తన ఫిర్యాదులో తెలిపింది.