చానల్ నిర్వహణ తన ఇష్టారాజ్యంగా జరగాలన్న పంతంతో ఫోర్జరీకి పాల్పడి…నూతన యాజమాన్యానికి అడ్డంకులు సృష్టిస్తూ కొత్త వివాదంలో చిక్కిన టీవీ9 సీఈఓ రవిప్రకాశ్ భవిష్యత్ తేలే సమయం ఆసన్నమైంది. శుక్రవారం జరిగే కీలక సమావేశంలో ఆయన్ను సీఈఓ పోస్ట్ నుంచి తొలగించనున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం.
కొద్ది రోజుల కిందట ఏబీసీఎల్ కార్పొరేషన్ నుంచి టీవీ9ను అలంద మీడియా టేకోవర్ చేసింది. టీవీ9లో భారీ ఎత్తున కంపెనీ నిధులను రవిప్రకాశ్ దారి మళ్ళించాడని కొత్త యాజమాన్యం గుర్తించింది. సంస్థ నుంచి తప్పుకోవాలని కొన్నిరోజులుగా ఆదేశాలు జారీ చేసినా రవిప్రకాశ్ పట్టించుకోలేదని సమాచారం. కొత్త యాజమాన్యం కంపెనీ ఆర్థిక లావాదేవీలపై అంతర్గత విచారణ జరిపినట్టు తెలుస్తోంది. భారత్ వర్ష్ ఛానల్స్ వ్యవహారంలో రవిప్రకాశ్ కోట్లు దారి మళ్ళించినట్లుగా నిర్ధారణకు వచ్చిన యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు తాను టీవీ9 వ్యవస్థాపకుడిగా, ఛైర్మన్‌గా, సీఈఓగా బంజారాహిల్స్ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ నుంచి లైవ్‌లో మాట్లాడుతున్నానని రవిప్రకాశ్ వివరణ ఇచ్చారు. తన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు అంటూ వస్తున్న రూమర్లని, గత 15 సంవత్సరాలుగా టీవీ9 స్పష్టమైన విజయకేతనాన్ని ఎగరవేసిందని తెలిపారు.
ఇదిలాఉండగా, రవిప్రకాశ్, టీవీ9 భవిష్యత్ శుక్రవారం తేలనుంది. ఉదయం 11 గంటలకు టీవీ9 డైరెక్టర్ల మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో సీఈఓ నియామకంపై చర్చ జరగడంతో పాటుగా ఆ పదవిని నిర్వహించే వ్యక్తిపై నిర్ణయం తీసుకోనున్నారు. రవిప్రకాశ్‌ను తొలగించేందుకే డైరెక్టర్లు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.