తెలంగాణ బిడ్డ గల్ఫ్ గోసకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెరదించారు. దేశం కాని దేశంలో ఆందోళనలో ఉన్న పౌరుడిని అన్ని సౌకర్యాలతో స్వదేశానికి వచ్చే ఏర్పాట్లు చేశారు. ఇందుకు సహకరించిన విదేశాంగ శాఖ అధికారులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తకు స్పందించి సహకరించిన కేటీఆర్‌ను పలువురు ప్రశంసిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే…కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మక్తపల్లి గ్రామానికి చెందిన పాలేటి వీరయ్య జీవనాధారం కోసం అబుదాబి వెళ్లి.. నగరానికి 20 కిలోమీటర్ల దూరంలోని ఓ ప్రాంతంలో ఒంటెను కాసే పనిలో కుదిరాడు. రెండేండ్లుగా జీతం ఇవ్వకుండా, తిండి పెట్టకుండా వేధిస్తున్న యజమాని చేతిలో నరకయాతన అనుభవిస్తున్నాడు. ఆయన గోడు వెల్లబోసుకొంటున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవడంతో ఈ ఘటన అందరి దృష్టికి వచ్చింది. వీరయ్య కష్టాల వీడియోను నెటిజెన్ ఒకరు ట్విట్టర్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పంపారు. దీనిపై వెంటనే స్పందించిన కేటీఆర్.. వీరయ్య కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. వీడియోను కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్, యూఏఈలో భారత రాయబారి నవదీప్ సూరి, అబుదాబిలో భారత ఎంబసీ అధికారులకు ట్యాగ్ చేస్తూ.. బాధితుడిని ఇండియాకు తీసుకురావడానికి సాయం చేయాల్సిందిగా కోరారు.
Relieved for Veeraiah Garu and his family back home. Many thanks to the embassy team in Riyadh and our own hyderabadi and Ambassador @drausaf Ji ?? https://t.co/stP1ZPtP5b
— KTR (@KTRTRS) May 9, 2019
కేటీఆర్ స్పందన నేపథ్యంలో, యూఏఈలో భారత రాయబారి నవదీప్ సూరి ప్రత్యేక బృందాలతో బాధితుడికి సహాయం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. వీరయ్య ఆచూకి పట్టుకొని ఆయన యజమానితో మాట్లాడారు. రంజాన్ పండుగ తర్వాత వీసా ప్రక్రియను పూర్తి చేసి వీరయ్యను స్వదేశానికి పంపిస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని నవదీప్ సూరి కేటీఆర్‌కు తెలిపారు. దీనికి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.