ఆంధ్రప్రదేశ్‌లో అధికారం ఎవరిదో దాదాపు ఖరారు అయిపోయినట్లే. ఏపీలో పోలింగ్ జరిగి ఇంకో మూడు రోజులు గడిస్తే నెల రోజులు అవుతుండగా ఇప్పటికే ప్రజలు ఓ క్లారిటీకి వచ్చారు. ఏపీలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తుండగా జనసేన పార్టీ కింగ్ మేకర్ పాత్ర పోషిస్తానని ఆశపడుతోంది. అయితే, ప్రజలు మాత్రం అధికారం వైసీపీదేనని స్పష్టం చేస్తున్నారు. గల్లీలో ప్రజల మాట ఇలా ఉండగా, ఢిల్లీలో నాయకులు ఏమనుకుంటున్నారనే ఆసక్తి సహజంగానే ఉంటుంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సన్నిహితుడనే పేరున్నజాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఏపీ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీలో మురళీధర్‌రావు మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటివరకు ఎన్నో విధాలుగా ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేశారని..ఇక మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేదరని చెప్పారు. ప్రజలు చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారన్న మురళీధర్ రావు… ఈ ఎన్నికలతో ఏపీలో టీడీపీ ప్రస్థానం ముగిసిపోయిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 110 సీట్లు వస్తాయన్నారు మురళీధర్ రావు. ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతుందని అభిప్రాయపడ్డారు.ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసిన తర్వాతే ఈవీఎంలపై చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ఎన్డీయేలో చంద్రబాబుకు శాశ్వతంగా తలుపులు ముసుకుపోయాయని..తమ కూటమిలో టీడీపీ చేరే ప్రసక్తే లేదని మురళీధర్ రావు స్పష్టం చేశారు. ఏపీలో వైసీపీదే అధికారంలోకి రాబోతోందని ఢిల్లీలోని ముఖ్యనేతల్లో ఒకరు జోస్యం చెప్పడం సంచలనంగా మారింది. తెలుగుదేశం పార్టీ దుకాణం బంద్ అయిందనే వ్యాఖ్యలకు ఇదే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.