రంజాన్ మాసం ముస్లీంలు అత్యంత పవిత్రంగా భావించే నెల. చంద్రమాన కాలమానం పాటించే ముస్లీం ప్రజలు సరిగ్గా నెల వంక (చంద్రవంక)ను చూస్తూ ప్రారంభమయ్యే రంజాన్ మాసం ముస్లీంలకు పరమ పవిత్రమైనది. ముస్లీం ప్రజలు రంజాన్ మాసాన్ని వరాల వసంతంగా, అన్నీ శుభాలను ప్రసాదించే నెలగా సంబోధిస్తారు. పూర్తిగా నెల రోజుల పాటు అల్లాను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.
ఇక రంజాన్ పర్వదినం అనగానే అందరికీ గుర్తుకొచ్చే విషయం ఉపవాసం. అల్లాకు దగ్గరవ్వడానికి, తాము చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం పొందడానికి ఉపవాసం ఒక గొప్ప మార్గమని, ఉపవాసాన్ని పాటించే గొప్ప అవకాశాన్ని అల్లా తమకు కల్పించారని భావిస్తూ నెల రోజుల పాటు కుటుంబంలోని ప్రతీఒక్కరు తప్పకుండా ఉపవాసం ఉంటారు. దైవభక్తిని పెంపొందించుకునేందుకు ఉపవాసమే సరైన మార్గమని, రంజాన్ మాసమంతా ఉపాసముంటే మిగతా 11 నెలలు అల్లా అనుగ్రహం తమపై ఉంటుందనే నమ్మకంతో భక్తులందరూ విధిగా దీనిని పాటిస్తారు.
రంజాన్ మాసంలో ఉపవాసంతో లాభాలేంటి..?
రంజాన్ మాసంలో ఉపవాసం పాటించని వారంటూ ఎవ్వరూ ఉండరని, పాటించని వారు మూర్ఖులతో సమానమని ఖురాన్‌లో పేర్కొనబడింది.ఈ మాసమంతా అల్లాపై అత్యంత భక్తిశ్రద్ధలతో ఎవరైతే దానధర్మాలు చేస్తారో.. ఎవరైతే అత్యంత క్రమశిక్షణతో ఉంటూ పుణ్యకార్యాలు చేస్తారో..వారు మరణానంతరం రెయ్యాన్ అను ద్వారం గుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారని, ఉపవాసం ఉండి కూడా చెడు కార్యాలు చేసే వారు నరకానికి వెళ్తారని మహ్మద్ ప్రవక్త చెప్పినట్లు ఖురాన్‌లో పేర్కొనబడింది. అందుకే రంజాన్ మాసాన్ని ముస్లీంలు అంత విశేషంగా భావిస్తారు.