నరేంద్రమోడీ ప్రధాని కాదని అతను ఒక బాక్సర్ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హర్యాణా రాష్ట్రంలోని ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. భారత్‌కు అంతర్జాతీయ బాక్సర్‌లను అందించిన భీవండి ఎన్నికల ప్రచార సభలో ఈ వ్యంగ్యాస్త్రాలను సంధించారు.
మోడీ ప్రధాని కానే కాదని అందరీపై పంచులు కురిపించే బాక్సర్ అంటూ సంబోధించారు. 2014 ఎన్నికల్లో దేశ ప్రజలంతా ఒక బాక్స్‌ర్‌కు ఓట్లు వేసి ధూంధాంగా దేశంపైకి వదిలారన్నారు. మోడీ తన రాజకీయ గురువైన ఎల్‌కే అద్వానీని అగౌరవ పరిచారని, గురువు అని కూడా చూడకుండా అతని రాజకీయ జీవితంపై కోలుకోలేని గుద్దు గుద్దారని ఆరోపించారు. అంతేకాకుండా తనకు అడ్డుగా వస్తారని భావించిన జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్రమంత్రి ఆరుణ్ జైట్లీపై కూడా మోడీ పంచులు గుప్పించారన్నారు.
గడిచిన ఐదేళ్లలో బీజేపీని నమ్మి ఓట్లు వేసిన రైతులను, మహిళలను, చిన్నపాటి వ్యాపారులను, రోజువారీ కూలీలను, పేదలను, మధ్యతరగతి ప్రజలను ప్రతిఒక్కరిపై పంచుల వర్షం కురిపించారన్నారు. జీఎస్టీని గబ్బర్‌సింగ్ ట్యాక్స్‌గా అభివర్ణించిన రాహుల్ గాంధీ… సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలను కాపాడాల్సింది పోయి జీఎస్టీ, నోట్ల రద్దుతో తేరుకోలేని పంచులు విసిరారన్నారు. చిరు వ్యాపారులను సైతం రింగ్‌లోకి లాకి మోడీ తన బాక్సింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించారన్నారు. 56 అంగులాల భారీ ఛాతీ ఉందంటూ బీరాలుపలికే మోడీ సామాన్యులపై తన ప్రతాపం చూపకుండా పేదరికం, అక్షరాస్యత, కులవివక్ష, ఆర్థిక సంక్షోభం, రైతుల సమస్యలు తదితర అంశాలపై బాక్సింగ్ చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని అయిన కొత్తలో కాస్త హడావిడీ చేసిన మోడీ తర్వాతి కాలంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు.
పేదల బ్యాంక్ అకౌంట్లలో ప్రతి ఒక్కరి అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేస్తానని, విదేశాల్లో ఉన్న నల్లధనం మొత్తం భారత్‌కు తీసుకొస్తానని చెప్పిన మోడీ.. ఆ రెండు అంశాలలో మాత్రం నాకౌట్ అయ్యారన్నారు. గత ఐదేళ్లుగా దేశ ప్రజలను మోసం చేస్తూ వచ్చారని అన్నారు. దేశానికి బీజేపీ చేసిందేమీ లేదన్నారు. బీజేపీ నేతలు చేతకాని హామీలు ఇవ్వొద్దని హితవు పలికారు.