మండుతున్న ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు పలు ప్రాంతాల్లో వర్షం అనుకోని అతిథిలా వచ్చి భీభత్సం సృష్టించింది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఏపీ నూతన రాజధాని అమరావతి చూట్టు మంగళవారం మధ్యాహ్నాం వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉదయం వరకూ ప్రశాంతంగా ఉన్న రాజధాని ప్రాంతం.. ఒక్కసారిగా ఈదురు గాలులు వీచడంతో చిగురుటాకులా వణికింది. గాలి, భారీవర్షం అమరావతి పరిసర ప్రాంతంలో బీభత్సం సృష్టించాయి. గాలల ధాటికి రాష్ట్ర సచివాలయంలో రేకులు ఎగిరిపడ్డాయి. సచివాలయ ప్రాంగణంలో స్మార్ట్‌పోల్, ఎంట్రీపాయింట్ కుప్పకూలాయి. బ్లాక్ టెర్రస్‌లో రేకులు ఎగిరిపడగా, నాలుగో బ్లాక్‌లో రేకులు ఈదురుగాలల ధాటికి విరిగిపోయాయి. అలాగే గుంటూరు, తాడికొండ ప్రాంతాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మంగళగిరిలో వడగాళ్ల వాన స్థానికులను అతలాకుతలం చేసింది.
