కృష్ణా జిల్లా గన్నవరం నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో సోమవారం విజయవాడ వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘వల్లభనేని వంశీకి ఓటమి భయం పట్టుకుంది. ప్రజలు తిరస్కరిస్తారన్న భయంతోనే ఆయన నామీద ఆరోపణలు చేస్తున్నారు అన్నారు. సమస్యలపై విమర్శలు చేసేనే కానీ, నేనెప్పుడూ వంశీపై వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదన్నారు. అంతేకాదు గతంలో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దంపతులు బెంగళూరులో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలిశారని అన్నారు. ఎమ్మెల్యే చేసిన దురాగతాలను ప్రజలు చెబితే మాట్లాడానని.. అసలు వంశీతో తనకు నేరుగా పరిచయమే లేదని అన్నారు. ప్రజలను వంశీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని..మా పార్టీ అధికారంలోకి వస్తే నా పరిస్థితి ఏంటి అన్న భయంతో వంశీ ఇలా వ్యవహరిస్తున్నాడు. తను చేసిన కుంభకోణాలూ బయటపడతాయి అని భయం. మా పార్టీ అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తాం, వంశీ అక్రమ దోపిడీలు అన్ని బట్టబయలు చేస్తామన్నారు. అమెరికా నుంచి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే తప్ప డబ్బు సంపాదన కోసం కాదని స్పష్టం చేశారు యార్లగడ్డ.
