ప్రశ్నించేందుకే వస్తున్నా అంటూ 2014లో జనసేన పార్టీని స్థాపించిన సినీ నటుడు పవన్ కళ్యాణ్ అప్పటి ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా లేనంటూ ఎన్డీయే కూటమి అయిన బీజేపీ-టీడీపీకి మద్ధతునిచ్చారు. అంతేకాకుండా బీజేపీ తరపున స్టార్ క్యాంపైనర్‌గా దక్షిణాది రాష్ట్రాల్లో పలు బీజేపీ తరపున ప్రచారం కూడా నిర్వహించారు. మోడీతోనూ వ్యక్తిగతంగా పలు సమావేశాల్లో సైతం పాల్గొన్నారు. ఇలా 2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 270కి పైగా స్థానాల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం అందుకోవడం మోడీ ప్రధానమంత్రి అవ్వడం. ఇటు రాష్ట్రంలోనూ తాను మద్ధతిచ్చిన టీడీపీ, బీజేపీ, జనసేన ఇలా ఎన్డీయే కూటమి అంతా ఒక్కటిగా ఉన్నప్పటికీ జగన్ నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ గట్టిపోటీ ఇచ్చింది.
చివరకు అతితక్కువ ఓట్‌షేర్‌తో టీడీపీ-బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కైవసం చేసుకోగా.. బీజేపీ నుంచి పలువురు నేతలకు చంద్రబాబు టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇవ్వడం, దీనికి తోడుగా అటు కేంద్రంలోనూ ఎన్డీయే కూటమి పొత్తులో భాగంగా టీడీపీ నేతలకు సైతం కేంద్రమంత్రి పదవులు దక్కాయి. ఈ సమయంలోనే జనసేనాని పవన్ కళ్యాన్ రాష్ట్రంలోని పలు సమస్యలపై గళం విప్పారు. ఉద్దానం కిడ్నీ బాధితులు, రైతులకు మద్ధతు ధర, విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక హోదా… ఇలా ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ కూడా ప్రజావ్యతిరేక విధానాలపై నిత్యం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నప్పటికీ పలు మీడియా సంస్థలు పవన్ కళ్యాన్‌ను ప్రధాన శీర్షికగా హైలైట్ చేయడం, దీనికి తోడు పవన్ లేవనెత్తిన ప్రతీ సమస్యపై ప్రభుత్వం, చంద్రబాబు వెనువంటనే స్పందించడం.. నువ్వు కొట్టినట్టు చెయ్యు, నేను ఏడ్చినట్టు చేస్తా అన్న చందంగా సాగాయి. మరోవైపు అభిమానుల హడావిడి, ఎల్లో మీడియా పవన్‌కు నిర్విరామంగా ప్రచారం చేయడం మరియు సోషల్ మీడియా అన్ని కలిసి పవన్ కళ్యాన్ విపరీతంగా హైలైట్ చేశాయి.
ప్రధానంగా ప్రశ్నిస్తా అనే ట్యాగ్ లైన్‌తో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాన్ ప్రశ్నించడంలో మాత్రం పూర్తిగా విఫలం చెందారనే చెప్పాలి. ఇందుకు నిదర్శనం పవన్ కళ్యాన్ ఎన్నికల ప్రచార సరళిని చూస్తే తెలుస్తుంది. వైసీపీ అధినేత జగన్‌పై విమర్శలతో ఎగిరెగిరిపడే పవన్ కళ్యాన్… టీడీపీ, చంద్రబాబుపై మాత్రం సుతిమెత్తంగా విమర్శలు చేయడం విశేషం. జగన్‌పై కోడికత్తి దాడి విషయంలోనూ పవన్ కళ్యాన్ రాజకీయాలు మాట్లాడటం గమనార్హం, ప్రశ్నించేందుకు ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్ష నేతనే టార్గెట్‌గా ఆరోపణలు చేయడం, నేను ఏ కులానికి సంబంధించిన వ్యక్తిని కాదంటూనే తన సామాజికవర్గ ఓట్లు ఎక్కువగా ఉన్న స్థానాల్లో పవన్ పోటీ చేయడం ఇలా అనేక విషయాల్లో జనసేన టీడీపీతో లోపాయికార సంబంధం కొనసాగిస్తున్నారనేది బహిరంగ రహస్యం.
పవన్ కళ్యాన్ కీలకంగా మాట్లాడే అంశం ప్రత్యేక హోదా దీనిపై పవన్ కళ్యాన్‌కు ఎంతపాటి అవగాహన ఉందో ఒక్కసారి మనం ఆలోచిస్తే… ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా (స్పెషల్ స్టేటస్)పై గట్టిగా తన వాదన వినిపిస్తున్నది ముందు నుంచే జగన్ అనే చెప్పాలి. దీని కోసం ఢిల్లీలోనూ జగన్ దీక్ష చేశారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడుతున్న ప్రతిపక్ష జగన్‌కు మద్దతుగా మాట్లాకపోయినప్పటికీ జగన్‌ను తిట్టడంలో పవన్ రాజకీయ పరిణితి అర్థమవుతుంది. కేంద్రప్రభుత్వ పరిధిలోని అంశం, అధికారంలో ఉన్న జాతీయ పార్టీ బీజేపీని, హోదా విషయంపై మౌనంగా ఉన్న టీడీపీని నిందించడంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలోనే ఎన్నికలు రావడం, ప్రచారం చేయడం, ఎన్నికలు ముగియడం అన్నీ చకచకా జరిగిపోగా ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలంతా వేచిచూస్తున్నారు.
ఒక వేళ జనసేన పార్టీకి 20-30 స్థానాలు సాధిస్తే ఎవరికి మద్ధతిస్తారు.?
ప‌్రతిపక్ష స్థానంలో ఎలా రాణిస్తారు.?
అంటే కాస్త జనసేన పరిస్థితి కష్టమనే చెప్పాలి. రాష్ట్ర ప్రజలంతా ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా మాత్రమే జనసేనకు ఓట్లు వేస్తారే తప్పా మరో విషయంలో కాదు. పవన్‌కు పడే ఓట్లు ముఖ్యంగా తన అభిమానులవే, అలా చూస్తే పవన్ టీడీపీకి మద్దతివ్వకూడదు. అలాగని వైఎస్సార్‌సీపీకి మద్దతిచ్చే నైతికత కూడా పవన్ కళ్యాణ్, జనసేన కోల్పోయిందని చెప్పుకోవాలి. ఒకవేళ అధికారంలో ఏపార్టీ వస్తుందో ఆపార్టీకి మద్దతిస్తే అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారు. గతంలో ప్రజారాజ్యం పార్టీకి పట్టిన గతే పడుతుందా..? అభిమానుల్లో వ్యతిరేకత వస్తుందా..? పార్టీ నేతలకు ఎలా తన ఆధీనంలో పెట్టుకుంటారు.? లేదా న్యూట్రల్‌గానే ఉంటారా..? తన ఎమ్మెల్యేలను అధికారపార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌లకు ఎలా అడ్డుకుంటారు..? 2024 ఎన్నికల వరకు జనసేన పార్టీ ఉంటుందా..? ఈ ఎన్నికల ఫలితాలు జనసేనకు వ్యతిరేకంగా ఉంటే పార్టీ మనుగడ ఉంటుందా..? ఇలా ఎన్నో ప్రశ్నలు.. ఎన్నో సందేహాలు.. ఏది ఏమైనా… పవన్‌కళ్యాణ్ జనసేన పార్టీకి భవిష్యత్తులో మనుగడ కత్తిమీద సాములాంటిది అని అనుకోవచ్చు.