కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎక్కడా అంతరాయం కలగుకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ప్రతీ పంపుహౌజ్ వద్ద డెడికేటెడ్ సబ్ స్టేషన్, ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. భారతదేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెగావాట్ల విద్యుత్ సామర్ధ్యం కలిగిన పంపుసెట్లు వాడుతున్నందున అన్ని సాంకేతిక అంశాలపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. పంపుసెట్ల పనితీరును కూడా ఒకటికి రెండు సార్లు పరీక్షించుకున్నట్లు వెల్లడించారు. పంపుసెట్లకు అవసరమైన విద్యుత్ అందించడానికి ఏర్పాట్లు చేయడంతో పాటు, భవిష్యత్తులో నిర్వహణకు సంబంధించి కూడా కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు.
మల్లన్నసాగర్ కు నీళ్లు పంపు చేసే సిద్దిపేట జిల్లా చంద్లాపూర్ పంపుహౌజు వద్ద 134.8 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపు నడవడానికి కావాల్సిన విద్యత్తు సరఫరాను ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు సోమవారం ఉదయం ప్రారంభించారు. 400 కెవి సబ్ స్టేషన్ ను, నీటి పంపింగ్ వ్యవస్థను నియంత్రించే కంట్రోల్ రూమ్ ను కూడా ఆయన ప్రారంభించారు. నీటి పంపింగు కోసం వేసిన విద్యుత్ లైన్లను, అమర్చిన మోటార్లను, టన్నెల్ ను ప్రభాకర్ రావు పరిశీలించారు. ట్రాన్స్ కో చేసిన ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. నీటి పంపింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు తెలిపారు. తెలంగాణకు లైఫ్ లైన్ అయిన కాళేశ్వర్ ప్రాజెక్టులో నీటిని లిఫ్ట్ చేయడం అత్యంత ముఖ్యమైన విషయమని ప్రబాకర్ రావు చెప్పారు. నీటిని లిఫ్టు చేయడానికి సకాలంలో సబ్ స్టేషన్లు నిర్మించి, లైన్లు ఏర్పాటు చేసిన అధికారులను అభినందించారు.
మిడ్ మానేరుకు చేరిన నీరు అక్కడి నుంచి అంతగిరి రిజర్వాయర్ చేరుకుంటుంది. అంతగిరి నుంచి రంగనాయక్ సాగర్ కు వస్తుంది. రంగనాయక్ సాగర్ నుంచి మల్లన్న సాగర్ కు నీరు చేరాలంటే 110 మీటర్ల ఎత్తుకు నీటిని పంపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం 539.20 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన పంపులతో లిఫ్టు చేయాల్సి ఉంది. దీనికోసం ఒక్కోటి 134.8 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు మోటార్లను బిగించారు. దీనికి కావాల్సిన విద్యుత్ ను ఎలాంటి ఆటంకం లేకుండా సరఫరా చేసేందుకు చంద్లాపూర్ లో 400 కెవి సబ్ స్టేషన్ నిర్మించారు. అక్కడే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు.