ఆంధ్రప్రదేశ్‌లో నువ్వా నేనా అన్నట్లు సాగిన 2019 ఎన్నికల్లో ఇరుపార్టీలు కత్తులు దూసుకున్నాయి. ఒకరిపై ఒకరు విపరీతమైన విమర్శలు చేసుకుంటూ రసవత్తరంగా ప్రచారాలు సాగాయి. గెలుపుపై ధీమాగా ఉన్న వైఎస్సార్‌సీపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు జగన్ మూహూర్తం కూడా ఫిక్స్ చేసేసుకున్నారు. ఇటు చంద్రబాబు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ కాలికి బలపం కట్టుకున్నట్టుగా జాతీయ నేతలను కలుస్తూ ఎన్నికల అవకతవకలపై వివరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎన్నిలపై తమకు అనుమానాలున్నాయంటూ జాతీయ ఎన్నికల కమీషన్‌కు సైతం లేఖలు రాసారు. ఓటమి భయంతోనే చంద్రబాబు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ గెలిస్తేనే ప్రజాస్వామ్యం గెలిచిందని, ప్రత్యర్థులు గెలిస్తే ప్రజాస్వామ్యం లేదంటూ టీడీపీ నేతలు వెర్రివాదనలు చేస్తున్నారని వైసీపీ శ్రేణులు అంటుండగా.. ప్రజలు ఎవరికి పట్టం కట్టారో తేలాలంటే మాత్రం మే 23 వరకు ఆగాల్సిందే.
ఇదిలా ఉంటే ఒకవేళ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు పరిస్థితేంటి?
టీడీపీ ఆంధ్రాలో మనుగడ సాగిస్తుందా.? అంటే కష్టమే అని చెప్పుకోవాలి. చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, అత్యంత ఒత్తిడిని ఎదుర్కొన్నారు. 2004 ఎన్నికలో సంక్షోభం లేనప్పటికీ సానుభూతి పవనాలతో గట్టెక్కెస్తా అనుకున్న చంద్రబాబుకు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఇక 2009 పరిస్థితికొస్తే పాదయాత్రతో రాష్ట్రం మొత్తం చుట్టేసిన వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ధాటి, చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ చీల్చిన ఓట్లు, టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు, వలసల స్థానాల్లో అందుకు ప్రత్యామ్నాయ నాయకులు తయారు చేసుకోవడంలో టీడీపీ అధినాయకత్వ విఫలం ఇలా అన్ని పరిణామాల నేపథ్యంలో ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ నాయకత్వంలో అధికారం కైవసం చేసుకుంది. ఆతర్వాత వైఎస్సార్ మరణం, తెలంగాణ ఉద్యమం ఎవ్తెత్తున ఎగిసిపడుతున్నసమయం, రాష్ట్రవిభజన జరగడం, 2014 ఎన్నికలు రావడం రెండు రాష్ట్రలపై సరైన స్పష్టత లేకపోవడం, రెండుకళ్ల సిద్ధాంతం అంటూ ఎటూ తేల్చుకోని సందర్భంలో చివరికి ఒక కన్ను పోయి తెలంగాణ రాష్ట్రంలో పోటీ కూడా చేయలేని పరిస్థితి దిగజారిపోయింది టీడీపీ. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఎట్టకేలకు అతితక్కువ ఓట్‌షేర్‌తో టీడీపీ విజయం సాధించింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.
ఆతర్వాతి ఐదేళ్ల కాలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు భారీగానే సాగాయి. టీడీపీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన అనేక హామీల అమలులో జాప్యం, పోలవరం, అమరావతి అంటూ ఐదేళ్లు కాలయాపన చేశారే తప్పా రాష్ట్రంలో పాలన ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా సాగింది. దీనికి తోడు కేంద్ర నిధుల వినియోగంలో చంద్రబాబు ప్రభుత్వం అవకతవకలు పాల్పడిందని బీజేపీ ఆరోపణలు, ఓటుకు నోటు కేసు, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ పొత్తు బెడిసికొట్టడం, ఇటీవలి కాలంలో ఐటీగ్రిడ్ ఇలా అనేక ఆరోపణల నేపథ్యంలో టీడీపీ కాస్త డీలా పడింది. మరోవైపు జగన్ పాదయాత్రతో రాష్ట్రాన్నంతా చుట్టేయడం. బైబై బాబు, రావాలి జగన్ – కావాలి జగన్ నినాదం వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇందుకు తోడుగా వైసీపీ నవరత్నాలుపై ప్రజల్లో విశేష స్పందన రావడం ఈ క్రమంలోనే ఎన్నికలు రావడం, గతంలో ఎన్నడూ లేని విధంగా 80శాతానికిపైగా ఓటింగ్ నమోదు కావడం ఇలా అన్నీ విషయాలు వైసీపీ విజయానికి కలిసొచ్చే అంశాలుగా చెప్పుకొవచ్చు. ప్రత్యక్షంగా ప్రకటించక పోయినప్పటికీ… చంద్రబాబుకు ఇవే చిట్టచివరి ఎన్నికలు భావిస్తున్న 2019 ఎన్నికలు లోకేష్ కేంద్రంగా సాగాయనే చెప్పాలి. చంద్రబాబు వయసు భారం, గతంలో లాగా చంద్రబాబు ఎంతవరకు యాక్టీవ్‌గా రాణిస్తారనే అంశం, ఇక వైఎస్సార్ వారసుడిగా జగన్ రావడం, వైఎస్సార్ హయాంలోని ఫీజు రియింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు ఇలా వైఎస్సార్సీపీ సంక్షేమ పథకాలను రాజకీయాలకు, పార్టీలకతీతంగా చిట్టచివరి లబ్ధిదారువరకూ చేరవేస్తే గత ఎన్నికల్లో జరిగిన సీన్ రిపీట్ అవ్వడమే కాకుండా టీడీపీకి, చంద్రబాబుకు కష్టంగా మారే అవకాశముంది. రాబోయే ఐదేళ్లు చంద్రబాబు ఎంత యాక్టివ్‌గా ఉంటారనేది పక్కనపెడితే యంగ్‌స్టర్స్ జగన్, లోకేష్, పవన్ కళ్యాన్ మధ్య పోటీగానే భావించాల్సి ఉంటుంది. గతంలో వైఎస్సార్ హయాంలోనూ చిన్న పాటి ధర్నాలు మినహా చంద్రబాబు ప్రతిపక్షం స్థానంలో పూర్తిగా విఫలం చెందారు.
లోకేష్‌కు ధీటైన వాక్చాతుర్యం లేకపోవడం, రాజకీయాలపై లోతైన అవగాహన లేకపోవడం మైనస్‌గా చెప్పుకోవచ్చు. ఇక పవన్ కళ్యాన్ విషయానికొస్తే 10 – 20 సీట్ల వరకు జనసేన సాధించగలిగితే ప్రతిపక్ష స్థానంలో పవన్ రాణించే అవకాశాలున్నాయి. సమస్యలను కరెక్ట్ రైస్ చేయడం, అభిమానుల హాడావిడి, సోషల్‌మీడియాలో పవన్ క్రేజ్ ఇలా పవన్ అవకాశాలున్నాయి. ఇలా చూస్తే జగన్‌కు పవన్‌కు ప్రధానంగా పోటీగా ఉంటుందే తప్పా, జగన్-లోకేష్ మధ్య పోటీ ఉంటుందని భావించలేము. లోకేష్ బలం తెలుగు దేశం పార్టీ, అదే లోకేష్ నాయకత్వం తెలుగుదేశం పార్టీకి బలహీనంగా మారినా ఆశ్చర్యం లేదు.
ఇలా అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీకి ఈ సారి గెలవడం డూ ఆర్ డై అన్న చందంగా మారింది. జగన్ దూకుడు, అందుకు తోడు గతంలో జగన్‌పై చంద్రబాబు వ్యవహారశైలి, చంద్రబాబుపై పలు అవినీతి ఆరోపణలు ఉన్ననేపథ్యంలో చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపినా అతిశయోక్తి లేదు. ఏదేమైనప్పటికీ జగన్ గెలిస్తే టీడీపీ మనుగడ కష్టమేఅని చెప్పుకోవాలి.