గ్రామాల అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, అందుకే టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాలు మరింత వేగవంతంగా అభివృద్ధి చెందుతాయని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా శనివారం మామడ మండలంలోని కొరిటికల్, పోతారం, అనంతపేట, పొన్కల్ గ్రామాల్లో ముమ్మర ప్రచారం చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో చేపట్టిన రోడ్ షోకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … తెలంగాణ సర్కారు ప్రవేశ పెట్టిన ప్రతీ సంక్షేమ పథకం పేదలకు ఎంతో అండగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ రూపొందించిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు దోహదం చేస్తాయని. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలో టీఆర్ఎస్ పోటీచేస్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఖచ్చితంగా అఖండ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మామడ మండల టీఆర్ఎస్ జడ్పీటీసీ అభ్యర్థి శైలజ జాదవ్, ఎంపీటీసీ అభ్యర్థులకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని నాయకులు, కార్యకర్తలు, ప్రజలను కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.