తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు తమ దూకుడు పెంచాయి. ప్రతి ఇంటికి జరుగుతూ అభ్యర్థులు హుషారుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని మోతే ఎంపీటీసీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు అభ్యర్థులు టిక్కెట్లు ఆశించారు.
అయితే అదే మండలానికి చెందిన సీనియర్ నేత కలిగేటి లక్ష్మణ్ కూడా తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన భార్య కాపురానికి రావడంలేదని స్థానిక నాయకులు గుర్తించారు. అయితే ఇదే విషయాన్ని లక్ష్మణ్ ని అడగగా తన భార్య కాపురానికి రావడం లేదని కోర్టులో కేసు నడుస్తోందని చెప్పారు. అంతే కాకుండా ఆ టికెట్ ని తన తల్లికి కేటాయిస్తే ఊరి ప్రజల సహకారంతో గెలిపించుకుంటానని స్థానిక నాయకత్వానికి విన్నవించుకున్నాడు.
దీన్ని గమనించిన నాయకత్వం నీ భార్యను తీసుకొని వస్తేనే నీకు టికెట్ ఇస్తామని చెప్పారు. ఇక రంగంలోకి దిగిన లక్ష్మణ్… తన భార్య తరుపు బంధువులతో చర్చలు జరిపారు. కాపురానికి వచ్చేలా ప్రయత్నం చేసి ఆమెను ఒప్పించాడు. దీంతో టిఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మణ్ భార్యకు టికెట్ వచ్చేలా కృషి చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ భార్య గురువారం పార్టీ ఇచ్చిన బి ఫాం ఆరో ఓ కి అందజేశారు.