Home / POLITICS / మల్లన్నసాగర్ పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ..!!

మల్లన్నసాగర్ పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ..!!

మల్లన్నసాగర్ రిజర్వాయర్ భూ నిర్వాసితుల పునరుపాధి, పునరావాస సాయం పంపిణీ కార్యక్రమం వందకు వంద శాతం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్  అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు పరిహారం ఇచ్చే కార్యక్రమం చాలా వరకు పూర్తయిందని, మిగిలిన కొద్దిపాటి ప్రక్రియను కొద్ది రోజుల్లోనే పూర్తి చేసి, ఈ నెల 11వ తేదీలోగా హైకోర్టుకు నివేదిక పంపాలని సీఎం సూచించారు. పరిహారం చెల్లింపు విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి, సీనియర్ అధికారులతో మాట్లాడారు. నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకునే విషయంలో ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో, అత్యంత మానవత్వంతో వ్యవహరిస్తున్న విషయాన్ని సీఎం గుర్తుచేశారు. అయినప్పటికీ కోర్టులు తరచూ జోక్యం చేసుకునే పరిస్థితులు రావడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిర్వాసితులకు పరిహారం అందించే ప్రక్రియను వెంటనే ముగించే కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.కె. జోషిని సీఎం కోరారు. పరిహారం పంపిణీ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో నిర్వహించే బాధ్యతలను సీఎంవో కార్యదర్శి శ్రీమతి స్మితా సభర్వాల్ కు ముఖ్యమంత్రి అప్పగించారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు పరిహారం పంపిణీ కార్యక్రమం చేపట్టేందుకు గ్రామాల వారీగా శిబిరాలు నిర్వహించాలని, ప్రత్యేక అధికారులను నియమించాలని కేసీఆర్ ఆదేశించారు.

‘‘లక్ష కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణలో 40 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందివ్వడానికి అతి పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నాం. అందులో భాగంగా 50 టిఎంసిల సామర్థ్యం కలిగిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మిస్తున్నాం. మల్లన్నసాగర్ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటిది. ఇంత పెద్ద రిజర్వాయర్ నిర్మించే క్రమంలో కొద్ది మంది భూములు, ఇండ్లు కోల్పోతున్నారు. వారి విషయంలో ప్రభుత్వం ఎంతో సానుభూతితో, మానవత్వంతో వ్యవహరిస్తున్నది. నిర్వాసితులు మెరుగైన పునరుపాధి, పునరావాసం పొందడానికి ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచే ప్యాకేజీని అందిస్తున్నది. రూ. 800 కోట్లను మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారం, పునరావాస కార్యక్రమాల కోసమే ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. ప్రభుత్వం ఇంత చేసినా, కొద్ది మందికి సాయం అందించే విషయంలో జరిగిన జాప్యం వల్ల కోర్టులు తరచూ జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. అది అత్యంత బాధాకరం. ఏనుగు ఎల్లింది, తోక మిగిలింది అనే చందంగా మొత్తం ప్రక్రియలో కొద్ది పాటి పరిహారం ఇవ్వడమే మిగిలింది. దీనిని అలుసుగా తీసుకుని కొంత మంది వ్యక్తులు, ప్రగతి నిరోధక శక్తులు ప్రాజెక్టునే ఆపడానికి కుట్రలు చేస్తున్నారు. పరిహారం పంపిణీ ప్రక్రియలో మిగిలిన కొంచెం పనిని కూడా త్వరగా పూర్తి చేసి, చిల్లర పంచాయితీని వెంటనే ముగించాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

‘‘పరిహారం పంపిణీని యుద్ధ ప్రాతిపదికన ముగించి, కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ మాదిరిగానే శరవేగంగా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టాలి. యుద్ధం జరుగుతుందా అన్నట్లుగా పనులు చేసి, ఆరేడు నెలల్లోనే మల్లన్నసాగర్ నిర్మాణం పూర్తి చేయాలి. వచ్చే ఏడాది జూన్ లో రిజర్వాయర్ లో నీళ్లు నింపాలి’’ అని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

సీఎం ఆదేశాలతో కదిలిన అధికార గణం
మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారం అందించే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో అధికార యంత్రాగం కదిలింది. నీటి పారుదల శాఖను కూడా నిర్వహిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి తన అమెరికా పర్యటనను రద్దు చేసుకుని, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిహారం పంపిణీ ప్రక్రియను ముగించడానికి ప్రణాళిక రూపొందించారు. సిద్దిపేట కలెక్టర్ కృష్ణ భాస్కర్, సిద్దిపేటలో గతంలో విధులు నిర్వహించిన సిరిసిల్ల కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డితో సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్ సమావేశమయ్యారు. ఇప్పటి వరకు అందిన పరిహారం వివరాలు తెలుసుకుని, మిగిలి వారికి పరిహారం అందించే కార్యక్రమాన్ని ఖరారు చేశారు. మల్లన్నసాగర్ పరిధిలోని 8 గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, నిర్వాసితులకు పరిహారం అందించాలని నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేక అధికారులను నియమించారు. రాంపూర్, లక్ష్మాపూర్, బ్రాహ్మణ బంజెరుపల్లి గ్రామాలకు డీఆర్వో బి. చంద్రశేఖర్, సిద్దిపేట ఆర్డీఓ ఎం. జయచంద్రారెడ్డిలను, పల్లెపహాడ్ గ్రామానికి ‘గడా’ స్పెషలాఫీసర్ ముత్యంరెడ్డి, సిద్దిపేట ఆర్డీఓ ఎం. జయచంద్రారెడ్డి, హైదరాబాద్ ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డిలను, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామానికి ‘గడా’ స్పెషలాఫీసర్ ముత్యంరెడ్డి, సిద్దిపేట ఆర్డీఓ ఎం.జయచంద్రారెడ్డి, సిరిసిల్ల ఆర్డీఓ శ్రీనివాస్ రావులను, వేములఘాట్ గ్రామానికి ‘గడా’ స్పెషలాఫీసర్ ముత్యంరెడ్డి, సిద్దిపేట ఆర్డీఓ ఎం. జయచంద్రారెడ్డి, సికింద్రాబాద్ ఆర్డీఓ రాజాగౌడ్, హుస్నాబాద్ ఆర్డీఓ కె. అనంతరెడ్డిలను, సింగారం గ్రామానికి గజ్వేల్ ఆర్డీఓ డి. విజయేందర్ రెడ్డి, మల్కాజ్ గిరి ఆర్డీఓ మధుసూదన్ లను, ఎర్రవల్లి గ్రామానికి గజ్వేల్ ఆర్డీఓ డి. విజయేందర్ రెడ్డిని ప్రత్యేక అధికారులుగా నియమించారు.

ప్రారంభమయిన పరిహారం పంపిణీ

సింగారం, రాంపూర్ గ్రామాల్లో 800 మంది నిర్వాసితులకు చెక్కుల ద్వారా పరిహారం పంపిణీ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమయింది. మిగతా గ్రామాల్లో ప్రత్యేకాధికారుల సమక్షంలో శనివారం నుంచి చెక్కుల పంపిణీ జరుగుతుంది. ఎవరైనా చెక్కులు తీసుకోవడానికి విముఖత చూపితే, వారి అభిప్రాయాన్ని వీడియో తీయాలని అధికారులు నిర్ణయించారు.

నిర్వాసితులకు ప్రభుత్వం అందిస్తున్న సాయం

ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి దేశంలో కెల్లా అత్యంత మెరుగైన పునరావాస ప్యాకేజిని ప్రభుత్వం అందించింది. రైతులు కోల్పోయిన భూములకు, వ్యవసాయ కొట్టాలకు, బావులకు, బోర్ వెల్స్ కు, చెట్లకు, తోటలకు, పైపులైన్లకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం పరిహారం అందించింది. పునరుపాధి, పునరావాస ప్యాకేజి కింద ఈ క్రింది విధంగా సాయం అందిస్తున్నది.

  1. కేంద్ర చట్టం ఒక్కో ఇంటికి రూ.1.25 లక్షల వ్యయమయ్యే 60 గజాల స్థలంలో ఇందిరా ఆవాస్ యోజన ఇల్లు మంజూరు చేయాలని చెబుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మల్లన్న సాగర్ నిర్వాసితులకు అంతకన్నా నాలుగు రెట్లు ఎక్కువగా, దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఒక్కో ఇంటికోసం రూ.5.04 లక్షల విలువైన 560 అడుగుల డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తున్నది. ఈ ఇండ్లను కూడా ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాకుండా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎడ్యుకేషన్ హబ్ పక్కన 460 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వమే నిర్మించి ఇస్తున్నది. ఇల్లు వద్దు అనుకునే వారికి 250 గజాల ఇంటి స్థలం, రూ.5.04 లక్షల నగదు అందిస్తున్నది.
  2. ప్రస్తుతం ఉన్న ముంపు గ్రామంలోని ఇంటి స్థలానికి గజం రూ. 1600 చొప్పున లెక్క గట్టి పరిహారం చెల్లిస్తున్నది.
  3. కోల్పోయిన ఇంటికి కూడా శాస్త్రీయంగా లెక్కగట్టి పరిహారం చెల్లిస్తున్నది.
  4. ఒక్కో కుటుంబానికి రూ.7.50 లక్షల పునరావాస ప్యాకేజీ అదనంగా అందిస్తున్నది.
  5. 18 సంవత్సరాలు దాటిన అవివాహితులకు కూడా రూ.5 లక్షల పునరావాస సాయం, 250 గజాల ఇంటి స్థలం ఇస్తున్నది.
  6. పునరావాస ప్యాకేజి కింద ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇంటికి ఆర్డీఓ సంతకంతో తహసీల్దార్ పట్టా జారీ చేస్తారు. అవసరమైన పక్షంలో ఈ ఇంటిని అమ్ముకోవడానికి, బహుమతిగా కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి అనుకూలంగా ఈ పట్టాలుంటాయి. మల్లన్నసాగర్ నిర్వాసితులకు ప్రభుత్వం అందిస్తున్న పునరోపాధి, పునరావాస కార్యక్రమం కింద గరిష్టంగా దాదాపు కోటి రూపాయల వరకు సాయం అందుతున్నది.
  • ఒక్కో కుటుంబానికి అందే మొత్తం: రూ. 7.50 లక్షలు
  • ఇద్దరు పెద్ద పిల్లలుంటే అందే మొత్తం: రూ.10 లక్షలు
  • కుటుంబానికి, పెద్ద పిల్లలకు కలిపి వచ్చేవి మూడు ప్లాట్లు (750 గజాలు): రూ.75 లక్షలు (ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం)
  • కోల్పోయిన ఇంటికి, ఇంటి స్థలానికి పరిహారం: విస్తీర్ణాన్ని బట్టి

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat