తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు సాయం అందుకుంటోన్న రైతన్నలకు టీ సర్కారు శుభవార్తను వినిపించనుంది. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రైతు బంధు నగదును రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. దీంతో పాటు గతేడాది రెండో విడత రైతు బంధు అందని రైతులకు ఈ విడుతలో పాతవి కూడా కలిపి ఇచ్చేందుకు అధికారులు కసరత్తులు షురూ చేశారు.
ఈ నెలాకరుకల్లా ఖరీఫ్ రైతు బంధు నిధులను అందజేసేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. గత ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీల్లో రైతుబంధు నిధులను ప్రభుత్వం రైతులకు అందజేసిన సంగతి తెలిసిందే. రైతు బంధు కింద ప్రతి రైతుకు ఏడాదికి 8 వేల రూపాయల చొప్పున రెండు విడతలుగా అందజేసింది.
ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఏడాదికి రెండు సీజన్లకు ఎకరానికి 10 వేల రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఏటా ఖరీఫ్‌కు సంబంధించి రైతు బంధు సాయాన్ని మేలోనే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఖరీఫ్ ప్రారంభానికి ముందే రైతులు విత్తనాలు, సాగు సహా ఇతరత్రా ఖర్చులకు వినియోగించుకోవడానికి ఈ నగదు రైతులకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రైతుబంధు కోసం12 వేల కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించింది.