హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుభాషణ్ రెడ్డి (76) బుధవారం అనారోగ‍్యంతో కన్నుమూశారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జస్టిస్ సుభాషణ్ రెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు న్యాయమూర్తులు, న్యాయకోవిదులు సంతాపం తెలిపారు. సుభాషణ్ రెడ్డి భౌతికకాయాన్ని అవంతినగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. సుభాషణ్ రెడ్డి అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం మహాప్రస్థానంలో జరగనున్నాయి. సుభాషణ్ రెడ్డి గతంలో మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గానూ, లోకాయుక్త చైర్మన్ గానూ సేవలందించారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. దేశానికి ఆయన అందించిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో సుభాషణ్ రెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
