టీఆర్‌ఎస్ 18వ అవిర్భావ దినోత్సవం శనివారం తెలంగాణ భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ జెండాను అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ఇన్నేళ్లు కేసీఆర్ వెంట నడిచిన గులాబీ సైనికులకు పార్టీ అవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంచుకున్న లక్ష్యంలో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా.. రెండు సార్లు సీఎం అయిన ఘనత సీఎం కేసీఆర్ సొంతం అన్నారు. 2001లో కేసీఆర్ ఒంటరిగా తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టారని గుర్తుచేశారు. అనేక ప్రతికూలతలు ఎదురైన కేసీఆర్ ధైర్యంగా ముందుకు సాగారని తెలిపారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ లాంటి వ్యక్తి కేసీఆర్ నిబద్ధతను కీర్తించారని తెలిపారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా టీఆర్‌ఎస్ జెండా ఎగురుతుందని.. లోక్‌సభ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
