తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ సైనికులందరికీ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యాలయంలో కేటీఆర్ టీఆర్‌ఎస్ జెండా ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సైనికులుగా పని చేసిన తెలంగాణవాదులందరికీ శుభాకాంక్షలు. 71 ఏండ్ల చరిత్రలో రాష్ట్రంలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చాయి. కానీ గట్టిగా నిలబడ్డ పార్టీ టీఆర్‌ఎస్ మాత్రమేనన్నారు. 2001లో కేసీఆర్ ఒంటరిగా ఉద్యమం మొదలు పెట్టారని, త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్ర ఏర్పడుతుందని 2001, ఏప్రిల్ 27న కేసీఆర్ అన్నారన్నారు.
1947లో దేశానికి స్వాతంత్య్రం వస్తే 1948లో భారతదేశంలో తెలంగాణ కలిసిందని, మాటమీద నిలబడుతూ ఆనాడు మూడు పదవులకు కేసీఆర్ రాజీనామా చేశారని గుర్తు చేసారు. 18 ఏళ్ల కాలంలో ఎన్నో అడ్డంకులను అధిగమించామని, ఇప్పుడు టీఆర్‌ఎస్ అజేయ శక్తిగా ఎదిగిందన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని మెచ్చుకుని ముందుకు పోవాలన్నారు. కేసీఆర్ నాయకత్వంలో 16 ఎంపీ స్థానాలు టీఆర్‌ఎస్సే గెలువబోతుందన్న విశ్వాసం ఉందని, గల్లీ నుంచి ఢిల్లీ వరకూ గులాబీ జెండా ఎగురుతుందన్నారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం ఆగకూడదు అంటే టీఆర్‌ఎస్ తెలంగాణ రాష్ర్టానికి శ్రీరామరక్ష అని బలమైన అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. రాబోయే ప్రతి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాల్సిందేనన్నారు.