ముఖ్యమంత్రిగా వైఎస్సార్సీపీ అధినేత ప్రమాణస్వీకారం చేయనుండడమే తరువాయ అనే సంకేతాలు వెలువడుతుండగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతోంది.. ఎంతో కాలంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని లేదా ప్రతిపక్షంలో ఉండి కూడా చీకటి ఒప్పందాలు చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్తారని వైసీపీ నేతలు పదేపదే విమర్శిస్తున్నారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు.. గత నాలుగేళ్లుగా చంద్రబాబు మంత్రి వర్గంలోని ప్రతీ శాఖపై కోట్లాది రూపాయల అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలవారీగా భూదోపిడీ ఒక ఎత్తైతే రాజధానిలో పాల్పడిన ఇన్ సైడర్ ట్రేడింగ్ చంద్రబాబు అక్రమాల్లో ప్రధానమైనది.
ఇంకా పోలవరం ప్రాజెక్టులో దోచుకున్న సగం డబ్బుతోనే టీడీపీ ఎన్నికలకు వెళ్లిందనేది ప్రధానమైన విమర్శ, అలాగే శ్రీవారి బంగారు ఆభరణాలు మాయమవడం, శ్రీవారి పింక్ డైమండ్ కనిపించకపోవడం వంటి రాష్ట్రాన్ని కుదిపేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఇసుక దోపిడీ, పధకాల్లో అవినీతి, రాజధాని నిర్మాణాన్ని విదేశీ సంస్థలకు అప్పగించడం, కేంద్రం నుంచి విడుదలైన నిధులను ఈవెంట్లకు, పబ్లిసిటీకి వినియోగించడం పట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వీటన్నిటికీ తోడు తాజాగా ఏసీబీ కోర్టుకు స్వర్గీయ ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి హాజరయ్యారు. చంద్రబాబుకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని 2005లో లక్ష్మీపార్వతి ఏసీబీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో లక్ష్మీపార్వతి ఫిర్యాదుపై హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే ఇటీవల పెండింగ్‌లో ఉన్న స్టేలను సుప్రీంకోర్టు ఎత్తేసింది. దీంట్లో చంద్రబాబుపై లక్ష్మీపార్వతి దాఖలు చేసిన కేసును కొనసాగిస్తారా.? ఉపసంహరిస్తారా.? అంటూ ఏసీబీ కోర్టు లక్ష్మీపార్వతిని కోరింది. ఈ క్రమంలోనే లక్ష్మీపార్వతి కోర్టుకు హాజరయ్యారు. అయితే పెండింగ్‌లో ఉన్న స్టేలను సుప్రీంకోర్టు ఎత్తేయడంతో ఈ కేసుతో పాటు చంద్రబాబుపై ఉన్న మరిన్ని స్టేలు విచారణకు వచ్చి చంద్రబాబు కచ్చితంగా జైలుకు వెళ్తారంటూ వైసీపీ నేతలు చెప్తున్నారు.