2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ముందుకెళ్తున్నామంటూ సంకేతాలిస్తోంది. టీడీపీ మాత్రం ఈ ఎన్నికలు చెల్లవని మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికలు సరిగా జరగలేదని, ఈవీఎంలలో తప్పులు జరిగాయని ఇలా రకరకాల కారణాలు చెప్తూ మరోసారి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపధ్యంలో ఇటీవల గవర్నర్ ను కలిసిన అనంతరం వైసీపీ అధినేత మాట్లాడుతూ ఓటమి భయం, ప్రజా వ్యతిరేకతతో చంద్రబాబు అలా మాట్లాడుతున్నారన్నారు. 2014లో తాము ఓడిపోయినపుడు ఓటమిని కూడా హుందాగా అంగీకరించామన్నారు. వాస్తవానికి మొత్తం 40వేల ఈవీఎంలు వినియోగిస్తే వాటిలో కేవలం 300 ఈవీఎంలలో మాత్రమే సమస్యలు తలెత్తగా సగానికి పైగా వెంటనే పరిష్కారం అయ్యాయి. మిగిలిన చోట లేట్ ఓటింగ్ జరిగింది. టీడీపీ అనుకూల మీడియా వీటినే హైలైట్ చేసింది. మొత్తం 40వేల ఈవీఎంలలో ఒక 100 నుంచి 120 ఈవీఎంలలో సాంకేతిక సమస్య అనేది అసలు విషయమే కాదు.
అసలు విషయానికొస్తే టీడీపీ వాదిస్తున్నట్టు కచ్చితంగా మళ్లీ ఎన్నికలు జరుగుతాయని వైసీపీ నేతలు కూడా బల్ల గుద్ది మరీ చెప్తున్నారు. అయితే కారణం మాత్రం కాస్త లాజికల్ గా ఉంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, టీడీపీ అసమర్థ పాలనతో, ప్రజా వ్యతిరేకతతో ఘోరంగా ఓడిపోతుందంటున్నారు. అప్పుడు తెలుగుదేశం నుంచి గెలిచిన ఇద్దరు ముగ్గురు ఎంపీలు, సుమారుగా ఓ 10మంది ఎమ్మెల్యేలు మళ్లీ వైసీపీలో చేరుతారని జోస్యం చోప్తున్నారు. అయితే తమ నాయకుడు రాజ్యాంగానికి లోబడి ఉంటారని, విలువలతో కూడిన రాజకీయాలు మాత్రమే చేస్తారని, గతంలో తనవెంట వచ్చిన 18మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి గెలిపించుకున్నట్టుగా ఇప్పుడు కూడా కచ్చితంగా తమ పార్టీలో చేరే ఎమ్మెల్యే, ఎంపీలతో రాజీనామాలు చేయించడం ద్వారా కచ్చితంగా ఏపీలో ఎన్నికలు మళ్లీ వస్తాయని, అవి చంద్రబాబు పగటి కలలు కంటున్నట్టుగా ఆ ఎన్నికలు కావని వైసీపీ శ్రేణులు చెప్తున్నారు.