గతంలో విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్ పై కోడికత్తితో దాడిచేసిన శ్రీనివాసరావు అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీనివాసరావును రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని పోలీసులు మాత్రం గోప్యంగా ఉంచారు. నిన్నరాత్రి పదిగంటల తర్వాత శ్రీనివాసరావుకు ఛాతిలో నొప్పి తీవ్రంగా రావడంతో ఆయనను రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను రాజమండ్రి జిల్లా ఆసుపత్రిలోని ప్రిజనర్స్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితి గురించి పోలీసులు, వైద్యం అందిస్తున్న డాక్టర్లు ఎలాంటి సమాచారాన్ని వెల్లడించడం లేదు. దీనిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొద్దిరోజుల్లో ప్రభుత్వం మారనున్న సమయంలో శ్రీనివాసరావుకు ఈ విథంగా జరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితిలో మాత్రం మార్పు రాకపోతే అతన్ని కాకినాడ ఆసుపత్రికి తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీలకోసం ఆసుపత్రి ఉంది. సాధారణ రోగాలకు అక్కడే వైద్యం అందిస్తుంటారు. సీరియస్ గా ఉన్న ఖైదీలను మాత్రమే జిల్లా ఆసుపత్రికి తరలిస్తారు. ఈ క్రమంలో శ్రీనివాసరావు పరిస్థితి బాగోలేదని మాత్రం స్పష్టంగా అర్ధమవుతుంది.
