తెలంగాణ రాష్ట్రాన్ని అంధత్వ రహిత బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం సత్ఫలితాన్నిచ్చింది. గత ఏడాది అంటే 2018 ఆగస్టు 15న లాంఛనంగా ప్రారంభమైన కంటి వైద్య శిబిరాల నిర్వహణను రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో విజయవంతంగా పూర్తిచేశారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అధికారులు, వైద్యులు, సిబ్బంది నిర్విరామంగా కంటి వైద్యశిబిరాలను నిర్వహించి మొత్తం 1,54,70,270 మందికి పరీక్షలు చేశారు.
కంటి పరీక్షలు, అద్దాల పంపిణీ, శస్త్రచికిత్సలను ఉచితంగా చేపట్టిన కారణంగా సబ్బండవర్ణాల ప్రజలు అధికసంఖ్యలో శిబిరాల్లో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా కంటి జబ్బులతో ప్రజలు కంటిచూపు కోల్పోతున్న దుర్భర పరిస్థితులను గుర్తించిన తెలంగాణ సర్కారు.. ముందుచూపుతో రాష్ట్ర ప్రజల్లో ఒక్కరు కూడా కంటి సమస్యతో బాధపడకూడదనే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించింది.
కార్నియా సమస్యతోనే కాకుండా రెటీనా, గ్లకోమా, మధుమేహం, ఇతర సమస్యలతోనూ కంటిచూపు కోల్పోతున్న వారికి వైద్యసేవలు అందించింది. అన్ని గ్రామాలు, పట్టణాల పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీలకు చెందిన ప్రజలు కంటి వైద్య శిబిరాల్లో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. ప్రభుత్వం ఒక వర్గానికి పరిమితం కాకుండా రాష్ట్రంలోని పౌరులందరికీ కంటి పరీక్షలు నిర్వహించింది. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.