1984లో తంగి సత్యనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసారు. ఆ సమయంలో ఎన్టీఆర్ పై కుట్ర చేసిన నాదెండ్లతో చేతులు కలిపారు. ఎన్టీఆర్ కు ఎమ్మెల్యేల బల నిరూపణకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వలేదు. అన్యాయంగా ఏర్పడ్డ నాదెండ్ల ప్రభుత్వంలోనే న్యాయ శాఖా మంత్రిగా పదవిని చేపట్టేందుకు స్పీకర్ పదవికి రాజీనామా చేసారు.
1995లో యనమల రామకృష్ణుడు సైతం ఏపీ స్పీకర్ గా పని చేసారు. అసెంబ్లీ లాన్ లో అర్థరాత్రివేళ బాబుకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలను లెక్కించి చంద్రబాబే ముఖ్యమంత్రి అని నిర్థారించేసారు. నిజానికిది రాజ్యాంగ విరుద్ధం. ఆ తర్వాత అసెంబ్లీలో ప్రకటన చేసే అవకాశం ఇమ్మని ఎన్టీఆర్ విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు యనమల. నిజానికి యనమలకు రాజకీయ భిక్ష పెట్టిందే ఎన్టీఆరే. ఆ విశ్వాసాన్ని, స్పీకర్ పదవికి ఉన్న విలువనూ నాశనం చేసారు యనమల.
2014లో కోడెల శివ ప్రసాదరావు విభజన తర్వాతి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి తొలిస్పీకర్ గా ఘనత సాధించారు. అదే సమయంలో ప్రజల వ్యతిరేకతను రుచి చూసిన స్పీకర్ గానూ చరిత్రలో నిలిచిపోయారు. 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అధికారపార్టీ ఫిరాయింపులు చేయించినా పట్టనట్టే ఉండిపోయారు కోడెల. ప్రతిపక్షాలకు మైకులు కట్ చేస్తూ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టయ్యారు. స్పీకర్ స్థానానికి ఉన్న విచక్షణాధికారాలను పూర్తిగా అధికారపార్టీ కోసం వినియోగించారు. టీడీపీ ఎమ్మెల్యేలు బూతులు మాట్లాడినా, ప్రతిపక్ష మహిళా నాయకురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించినా కనీసం చర్యలు తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించారు. రాజ్యాంగ విలువలను కాలరాసారు. చివరకు పోలింగ్ సమయంలోనూ చట్టవ్యతిరేక చర్యలు చేస్తూ ప్రజల ఆగ్రహానికి గురైయ్యారు. ఓ స్పీకర్ పై ప్రజలు తిరగబడి వెంటపడి కొట్టడం, దుమ్మెత్తి పోసి శాపనార్థాలు పెట్టడం దేశ చరిత్రలోనే ప్రప్రధమం. స్పీకర్ స్థానానికే కళంకం తెచ్చేలా వ్యవహరించిన కోడెల ఉదంతం భవిష్యత్ లో ఆ పదవిని చేపట్టి, అధికారపక్షానికి తొత్తులుగా వ్యవహరించే వారికి ఓ గుణపాఠంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.