తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున పదిహేను మంది ఎమ్మెల్యేలు,ఒక ఎంపీ గెలుపొందిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్శితులై టీడీపీకి చెందిన పదమూడు మంది ఎమ్మెల్యేలు,ఎంపీ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో టీడీఎల్పీను టీఆర్ఎస్ లో విలీనం చేస్తోన్నట్లు ఆ పార్టీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు అప్పటి స్పీకర్ మధుసూధనచారీకి లేఖ రాయడం. ఆ పార్టీని టీఆర్ఎల్పీ లో విలీనం చేయడం రెండు జరిగిపోయాయి.
తాజాగా ఇటీవల జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన సంగతి కూడా తెల్సిందే. తాజాగా వీరిలో పదిమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరతామని ప్రకటించారు. అయితే మరికొంతమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ ను టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయడం కోసం న్యాయనిపుణలతో చర్చలు జరుగుతున్నాయి. అయితే నిన్న ఆదివారం అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియానాయక్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ఎల్పీలో సీఎల్పీ విలీనం తప్పక జరుగుతుందని, దీనిపై న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. కాంగ్రెస్‌కు చెందిన 19 మంది ఎమ్మెల్యేలలో 10 మంది ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించారని.. మరి కొంతమంది టీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. రెండుమూడు రోజుల్లోనే వారు టీఆర్‌ఎస్‌లో చేరుతారని” తెలిపారు.