బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత కొద్ది రోజులుగా స్వల్పంగా తగ్గుతూ కాస్త దిగొచ్చిన పసిడి ధర. శుక్రవారం అమాంతం పెరిగింది. నేటి బులియన్ ట్రేడింగ్లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.305 పెరిగి, రూ.32,690కి చేరింది. స్థానిక జ్యువెలరీ వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడం బంగారం ధర పెరుగుదల కారణమని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండిధర కూడా స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ.204 పెరిగి, రూ.38,450కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ వల్ల వెండిధర పెరిగింది. గురువారం ఒక్కరోజే బంగారం ధర రూ.405 తగ్గడంతో 10 గ్రాముల పసిడి ధర రూ. 32,385కు పడిపోయింది. దీంతో ఒక్కసారిగా ఆభరణాల తయారీదారుల నుంచి పసిడి కొనుగోళ్లు పెరిగాయి.
