ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆ పదవికి కళంకం తెచ్చిన వ్యక్తి అని వైసీపీ ప్రదాన కార్యదర్శి , మాజీ మంత్రి సి.రామచంద్రయ్య అన్నారు. తన పదవిని దుర్వినియోగం చేసిన స్పీకర్ ను తాను మరొకరిని చూడలేదని ఆయన అన్నారు. 23 మంది వైసిపి ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేస్తే కనీసం వారికి నోటీసు కూడా ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆయన అన్నారు.అసెంబ్లీని ఏకపక్షంగా నడిపారని, చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాను అన్యాయంగా ఏడాది పాటు సస్పెండ్ చేశారని ఆయన అన్నారు. కోడెల బెదిరింపులకు ఎవరూ భయపడరని, ఆయన చరిత్ర అంతా అరాచకమేని ఆయన అన్నారు. గతంలో బాంబుల కేసు నుంచి బయటపడడానికి అప్పట్లో కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం సాయం చేసిందని రామచంద్రయ్య ఆరోపించారు. చట్టం ముందు అంతా సమానమేని, కోడెల తాను ఏదో అతీతుడు అన్నట్లుగా మాట్టాడుతున్నారని ఆయన అన్నారు. అదికారం శాశ్వతం కాదని కోడెల తెలుసుకోవాలని రామచంద్రయ్య అన్నారు.
