హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ పరుగులు పెడుతున్నది. కార్పొరేట్లకు దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన నగరంగా భాగ్యనగరం ఎదిగింది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని తొమ్మిది నగరాల్లో జరిగిన ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచినట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్‌ఈ వెల్లడించింది. ముఖ్యంగా బెంగళూరు నగరాన్ని హైదరాబాద్ తొలిసారి అధిగమించినట్లు పేర్కొన్నది. హైదరాబాద్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్, కొచ్చి నగరాల్లో 12.8 మిలియన్ చదరపు అడుగుల మేర ఆఫీస్ స్పేస్ లీజింగ్ జరిగింది.
మొత్తం తొమ్మిది నగరాల్లో జరిగిన లీజింగ్‌లో హైదరాబాద్ వాటానే 3.5 మిలియన్ చదరపు అడుగులు. గతేడాది ఇదే సమయంలో 1.1 మిలియన్ చదరపు అడుగులకే లీజింగ్ పరిమితమైంది. అయితే ఈసారి మాత్రం మూడింతలకుపైగా వృద్ధి చెందింది. ఈ క్రమంలోనే బెంగళూరుసహా ప్రధాన నగరాలను హైదరాబాద్ దాటేసింది. నగరంలోని మెరుగైన మౌలిక వసతులు, నైపుణ్య వనరులు, సులభతరమైన అనుమతులు.. కార్పొరేట్ వర్గాలను ఆకట్టుకున్నాయి. దీంతో ఒక్కసారిగా ఇక్కడి ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ పెరుగగా, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పోటీపడిమరి లీజులు చేసుకున్నాయి. ముందస్తు ఒప్పందాలూ ఇందుకు దోహదం చేశాయని సీబీఆర్‌ఈ చెప్పింది.
అన్ని రంగాల్లో అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు.. తెలంగాణను, ముఖ్యంగా రాజధాని నగరం హైదరాబాద్‌ను విశ్వవ్యాప్తం చేస్తున్నాయి. టీఎస్ ఐపాస్, యువతకు నైపుణ్య శిక్షణ, సులభతర అనుమతులు, అత్యుత్తమ పారిశ్రామిక విధానం.. తెలంగాణను కార్పొరేట్ ప్రపంచానికి చేరువయ్యేలా దోహదపడుతున్నాయి. ఈ క్రమంలోనే మున్ముందూ హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ మార్కెట్ ఆకర్షణీయంగా ఉంటుందన్న ఆశాభావాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. దేశీయ మార్కెట్ స్థిరంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని సీబీఆర్‌ఈ ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్య, ఆఫ్రికా దేశాల చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజైన్ వ్యక్తం చేశారు. అమెరికా సంస్థలు భారతీయ మార్కెట్‌పై ఆసక్తిని కనబరుస్తాయని చెప్పారు.