తెలంగాణ రాష్ట్ర వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకఘట్టం ఈ రోజు ఆవిష్కృతమైంది. వెట్ రన్ కోసం ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం ఆరో ప్యాకేజీ సొరంగంలోకి నీటిని ఇంజినీర్లు, అధికారులు విడుదల చేశారు. ఎల్లంపల్లి నుంచి 1.1 కిలోమీటర్ల పొడవున గ్రావిటీ కాల్వ ద్వారా జలాలు జంట సొరంగాల్లోకి పోతాయి. దాదాపు 11 మీటర్ల డయా ఉన్న ఒక్కో టన్నెల్ సుమారు 9.534 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా నంది మేడారంలోని సర్జ్‌పూల్‌కు నాలుగైదు రోజుల్లో నీళ్లు చేరుకోనున్నాయి. నంది మేడారం పంప్ హౌజ్‌లో 124.4 మెగావాట్ల సామర్థ్యం గలం మోటార్ల వినియోగంతో సాంకేతికంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసే వెట్ రన్ చేపడుతారు. ఈ ప్రక్రియ నిర్వహించేందుకు ఎల్లంపల్లి నుంచి 0.2 టీఎంసీ లోపు జలాల్ని మాత్రమే విడుదల చేశారు. నీటి విడుదల కంటే ముందు పాలకుర్తి మండలం వేమునూరు రెగ్యులేటర్ వద్ద అధికారులు పూజలు నిర్వహించారు.