ఏప్రిల్ 11, 2019 ఆంధ్రప్రదేశ్‌లో చరిత్రలో అత్యంత క్లిష్టమైన రోజు.. రెండు పార్టీలకు జీవన్మరణ సమస్యకు ఆరోజే ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. పోలింగ్ ఎనభై శాతం దాటడం ప్రజల ఆకాంక్షను బలంగా కనిపించింది. మే 23న వెలువడే తీర్పు ప్రజాస్వామిక స్పూర్తికి అద్దం పట్టనుంది. సాధారణంగా ఎన్నికలు అయిపోయాక మేనిఫెస్టోని పక్కన పడేస్తుండడంతో సహజంగానే ప్రజల్లో అసంతృప్తి కనిపించింది. కానీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆయనిచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. అయితే అనంతర పరిణామాలతో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తీరుతో ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. జన్మభూమికమిటీలు, ఇంటికి ఒకటే పెన్షన్, ఉద్యోగాల కల్పన లేమి, రైతాంగానికి అందని గిట్టుబాటు ధరలు వంటి సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఉత్పాదక వ్యయం తగ్గింది.
వృధా ఖర్చులు పెరిగాయన్న భావన సర్వత్రా నెలకొంది. లక్షలాది నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. కరువు పరిస్థితులు తీవ్రంగా నెలకొన్న దశల్లో రెయిన్‌గన్స్ అనే ప్రయోగం వైఫల్యం చెంది, పంటచేతికి రాక, వచ్చిన పంటలకు గిట్టుబాటు లేక, రైతులపై ఆధారపడ్డ రైతు కూలీలు అనేక ఇక్కట్లకు లోనవుతున్నారు. 2018కి పూర్తిచేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన పోలవరం అంచనాలు దఫదఫాలుగా పెంచడం తప్ప, ప్రాజెక్టు నిర్మాణం సాగలేదు.. ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ, 108, 104 అంబులెన్స్ లు ఎలా నీరుగార్చారో తెలిసిందే. రైతు, డ్వాక్రా రుణమాఫీ ఎండమావుల్నే తలపించాయి. ఇలాంటి జవాబుదారీతనం లేని ప్రభుత్వతీరు కచ్చితంగా ప్రజావ్యతిరేకతను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టంగా అర్ధమవుతోంది.