తెలంగాణ భవన్‌లో తెరాస విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ముగిసింది. గులాబీ దళపతి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన ఈ కీలక భేటీలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆసిఫాబాద్ జడ్పీ ఛైర్‌పర్సన్‌గా కోవా లక్ష్మి పేరును ఖరారు చేశారు. మిగతా స్థానాల్లో పేర్లను తర్వాత ఖరారు చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలు గెలవబోతున్నామని కేసీఆర్ విశ్వాసం వ్యక్తంచేశారు.
రెవెన్యూ చట్టంలో మార్పులు తప్పవు
రెవెన్యూ, మున్సిపల్ శాఖలను ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా సీఎం నేతలకు వివరించినట్టు తెలుస్తోంది. రెవెన్యూ చట్టంలో సమూల మార్పులు తప్పవని సీఎం అన్నారు. రాష్ట్రంలో మొత్తం 32 జడ్పీ, 530కి పైగా మండల పరిషత్ స్థానాలను కైవసం చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. ఒక్కో జిల్లా పరిషత్‌కు ఓ సీనియర్ నేతకు బాధ్యతలు అప్పగించారు. మండల పరిషత్‌లలో బాధ్యతలను ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు చూసుకోవాలని సూచించారు. అభ్యర్థుల ఎంపిక, కార్యవర్గం ఏర్పాటు తదితర ప్రక్రియ పూర్తయ్యేవరకూ అవసరమైన ఏర్పాట్లన్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు. రెవెన్యూ, మున్సిపల్ చట్టాలపై సీఎం కీలకంగా చర్చించినట్టు తెలుస్తోంది. రెవెన్యూ వ్యవస్థను రద్దుచేస్తే ఎలా ఉంటుందనే అంశంపై సీఎం సీనియర్ నేతలతో అభిప్రాయం తీసుకున్నారు. రెవెన్యూ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయని, వాటి స్థానంలో కొత్త చట్టం తీసుకురావడం మంచిదనివారు చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు సీఎం స్పష్టంచేసినట్టు సమాచారం. ఈ సమావేశంలో కేటీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.