శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణాలో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.
రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు; కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేక పోతే రాజ్యానికి వారసులు ఉండరని. అప్పుడు వశిష్ట మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. రుష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ, రెండో సగ భాగం చిన్న భార్య యైన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్యయైన సుమిత్రకు ఇచ్చారు. కొద్దికాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారు. చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు, మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికీ, సుమిత్ర లక్ష్మణ శతృఘ్నూలకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు.
ఈ పండగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్ళలో చిన్న సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి (మహారాష్ట్రలో), లేదా వసంతోత్సవం (ఆంధ్రప్రదేశ్ లో) తో తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు. ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు క్రీ.పూ 5114, జనవరి 10 న జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు