వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందానికి అభినందనలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లోని ‘ఐ–ప్యాక్’ కార్యాలయాన్ని సందర్శించిన జగన్ ప్రశాంత్ కిషోర్, ఆయన బృందం సభ్యులతో కొద్దిసేపు గడిపారు. జగన్ ఐప్యాక్ కార్యాలయానికి చేరుకోగానే అక్కడి సిబ్బంది అంతా ‘సీఎం.. సీఎం..’ అంటూ స్వాగతం పలికారు. కాబోయే ముఖ్యమంత్రి అంటూ జగన్ ను అభినందించారు. ఈ సందర్భంగా జగన్, ప్రశాంత్ కిషోర్ ను ఆలింగనం చేసుకున్నారు. తమకు అప్పగించిన పనిని పూర్తి చేసినట్టు ప్రశాంత్ కిషోర్ చెప్పారు. రెండేళ్లపాటు ఐప్యాక్ బృందం చాలా కష్టపడి పనిచేసిందని, వారందరికీ అభినందనలు తెలుపుతున్నానని జగన్ అన్నారు. బృందం సభ్యులంతా చాలా క్రియాశీలంగా వ్యవహరించినందుకు ఆయన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా పలు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ తాము నిర్వర్తించాల్సిన విధులకోసం ఐప్యాక్ బృందం సభ్యులు తరలి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ వెళ్లి మరీ వారిని కలిసి అభినందించారు. అయితే గతంలో అమరావతిలో జరిగిన పార్టీ ప్లీనరీలో జగన్ ప్రశాంత్ కిశోర్ ను పరిచయం చేసిన విషయం తెలిసిందే.