ఓటుకు నోటు కేసులో హైదరాబాద్‌ను వదిలి పారిపోయి వచ్చిన చంద్రబాబు 11 కేసులను తొక్కిపట్టిన గజదొంగ అని ప్రముఖ సినీనటుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మంచు మోహన్‌బాబు విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి చాలా మంచివారని, ఓట్లు వేసి జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తే మురిగిపోతాయన్నారు. అటువంటి వ్యక్తికి మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రం అధోగతేనంటూ మోహన్ బాబు ధ్వజమెత్తారు. భీమవరంలో మోహన్ బాబు బహిరంగసభలో మాట్లాడారు. నిత్యం అందుబాటులో ఉండే గ్రంధి శ్రీనివాస్‌ను ఎమ్మెల్యేగా, కనుమూరు రఘురామకృష్ణంరాజును ఎంపీగా గెలిపించుకోవాలన్నారు. సినిమాలు వేరు రాజకీయం వేరని, దీనిని భీమవరం ప్రజలు గమనించాలన్నారు. రాష్ట్రంలో కులపిచ్చిని రాజేసిన చంద్రబాబు పత్రికలు, టీవీలను తన చేతిలో పెట్టుకుని భజన చేయించుకుంటున్నాడని విమర్శించారు. నిత్యం జగన్‌పై కేసులు గురించి మాట్లాడే చంద్రబాబు తనపై ఉన్న కేసులు సంగతేమిటో ప్రజలకు చెబితే బాగుంటుందన్నారు.
ఆయన చుట్టూ ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలంతా ఇసుక, మట్టి మాఫియాతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. సభ్యత, సంస్కారం మర్చిపోయి ఎన్నికల సభల్లో వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని తిట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నాడన్నారు. గత ఐదేళ్లుగా తాను ప్రజలకు ఏం చేశానో చెప్పడం లేదని మోహన్‌బాబు విమర్శించారు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి పార్టీని లాకున్నాడనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. జగన్ సోదరి షర్మిళను కించపర్చే విధంగా మాట్లాడుతున్న చంద్రబాబుకు సభ్యత లేదని మండిపడ్డారు. పసుపు–కుంకుమ పేరుతో మళ్లీ మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సభలో గ్రంధి శ్రీనివాస్, కనుమూరు రఘురామకృష్ణంరాజు, కొయ్యే మోషేన్‌రాజు పాల్గొన్నారు. వందల సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు హాజరయ్యారు.