2019 ఎన్నికల్లో పర్చూరు పీఠం అధిష్టించేదెవరు.. జనసేవ ప్రభావం ఎవరికి ఇబ్బంది.. అధికార పార్టీ తన సీటును కాపాడుకునేనా.. జగన్ చరిష్మా, వైసీపీలో కొనసాగుతున్న చేరికలతో దగ్గుబాటి విజయం నల్లేరుపై నడకేనా? అన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. రాజకీయ విశ్లేషకులు సైతం ఈ సారి కులం కార్డు ప్రభావం ఎంతో అంచనా వేయడం కష్టంగా ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో పర్చూరు బరిలో ఈసారి అత్యధికంగా 15 మంది పోటీపడుతున్నా.. ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీ మధ్యే సాగుతోంది.
ప్రకాశంజిల్లా పర్చూరు నియోజకవర్గ బరిలో ఈసారి 15 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. గతానికి భిన్నంగా ఈ సారి అన్ని ప్రధానపార్టీలు తమ అభ్యర్థులను పోటీకి నిలిపాయి. దీంతో 2019లో పర్చూరులో బహుముఖ పోటీ ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం వైసీపీ, టీడీపీ మధ్యనే ఉంది. ఇతర పార్టీల అభ్యర్థులు ఎన్ని ఓట్లు చీలుస్తారు.. ఏ పార్టీకి వారి వల్ల నష్టం వాటిల్లుతుందనే విశ్లేషణ జోరుగా సాగుతోంది.
జనసేనతో మేలు ఎవరికి?
2014 ఎన్నికల్లో కూడా అధికంగా 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 7 రాజకీయపార్టీల అభ్యర్థులు, 8 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో నిలిచారు. 2014 ఎన్నికల్లో తేలుగుదేశం పార్టీ, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ మధ్యనే ప్రధాన పోరు సాగింది. అయితే అప్పటి ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ తెలుగుదేశానికి మద్దతు పలికారు. వైసీపీ అభ్యర్థి గొట్టిపాటి భరత్‌కన్నా, టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావుకు 10775 ఓట్లు అధికంగా వచ్చాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపులో జనసేన ప్రభావం అధికంగా కనిపించింది. అయితే ప్రస్తుత 2019 ఎన్నికల్లో జనసేన కూటమిగా ఏర్పడి పర్చూరు సీటును బీఎస్పీకి కేటాయించింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి: దగ్గుబాటి వెంకటేశ్వరరావు
పుట్టినతేదీ: 14–12–1953
విద్యార్హత: ఎం.బి.బి.ఎస్, పీజీ
తల్లిదండ్రులు: రమాదేవి, చెంచురామయ్య
సామాజిక వర్గం: ఓసీ
కుటుంబం: భార్య పురందేశ్వరి
కుమార్తె: నివేధిత
కుమారుడు: హితేష్‌చెంచురామ్
స్వగ్రామం: కారంచేడు గ్రామం, కారంచేడు మండలం, ప్రకాశం జిల్లా
గతానికి భిన్నంగా ఈ సారి పోటీ :
పర్చూరు అసెంబ్లీలో ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన కూటమి తరపున బీఎస్పీ పోటీ పడుతున్నాయి. పరాజయం ఎరుగుని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈసారి వైసీపీ తరఫున పోటీలో నిలిచారు. గతంలో టీడీపీ విజయానికి ఉతం ఇచ్చిన పవన్ కల్యాణ్ అభిమానుల ఓట్లు ఈసారి బీఎస్పీకి పడనున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో టీడీపీకి గడ్డుపరిస్థితి తప్పదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ అసమ్మతి నాయకులు, ప్రభుత్వ వ్యతిరేఖత, దళితుల భూములను నీరు–చెట్టు పేరుతో తవ్వి టీడీపీ నాయకులు కోట్ల రూపాయిలు దోచుకోవడం, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు వంటి పథకాలు తమకు లాభం చేకూరుస్తాయని వైసీపీ నాయకులు చెప్తున్నారు. నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్‌పార్టీల ప్రభావం స్వల్పంగానే ఉంది.
టీడీపీ గెలుపును దెబ్బతీసిన ప్రజారాజ్యం :
2009 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన సందు పూర్ణాచంద్రరావు 19056 ఓట్లు పొంది, తేలుగుదేశం పార్టీ గెలుపుపై తీవ్రప్రభావం చూపారు. దాంతో అప్పుడు కాంగ్రెస్‌పార్టీ తరపున పోటీ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి నరసయ్యపై 2960 ఓట్లమెజారిటీతో విజయం సాధించారు.
ప్రచారంలో దూసుకుపోతున్న పార్టీలు :
టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు నామినేషన్ వరకు పర్వాలేదనిపించారు. అయితే వైసీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి పరిస్థితి మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆర్భాటాలకు పోకుండా ప్రతి గ్రామానికి వెళుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారని, పాత పరిచయాలతో బంధుత్వం కలిపి చొరవగా వారి వద్దకు వెళుతూ ముందుకు సాగుతున్నారు. ఈ ఎన్నికలను ఏలూరి ఒంటరిగానే ఎదుర్కొక తప్పడం లేదు. చెప్పుకోదగ్గ ద్వితీయశ్రేణి నాయకుడు ఎవరూ ఆయనకు సాయపడలేకపోతున్నారని ప్రచారాన్ని బట్టి తెలుస్తోంది. దగ్గుబాటికి మాత్రం గొట్టిపాటి భరత్, వెంకటేశ్వరరావు తనయుడు యువకుడైన హితేష్‌చెంచురామ్‌లు తోడుగా నిలిచి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఈ ముగ్గురు మొనగాళ్లు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తమ గెలుపు నల్లేరుపై నడకేనని ధీమా వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
టీడీపీ అభ్యర్థి: ఏలూరి సాంబశివరావు
పుట్టినతేదీ: 26–01–1977
విద్యార్హత: ఎమ్మెస్సీ (హర్టీకల్చర్)
తల్లిదండ్రులు: ఏలూరి నాగేశ్వరరావు, సుశీలమ్మ
సామాజిక వర్గం: ఓసీ
కుటుంబం: భార్య మాలతి
కుమారులు: దివేశ్, మైనాంక్ తారక్
స్వస్థలం: కోనంకి గ్రామం, మార్టూరు మండలం