ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె సోమవారం గుంటూరు జిల్లా పొన్నూరులో బహిరంగ సభలో మాట్లాడారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారని, కుల,మత, పార్టీలకు అతీతంగా న్యాయం చేసిన ఏకైక నాయకుడు వైఎస్సార్ అని షర్మిల ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడున్న చంద్రబాబు పాలనలో రైతులకు దగా చేశారని, డ్వాక్రా మహిళలను మోసం చేశారన్నారు.
మూడేళ్లలో పోలవరంలో పూర్తి చేస్తామని మాట తప్పారన్నారు. అమరావతిని అమెరికా చేస్తా, శ్రీకాకుళంను హైదరాబాద్ చేస్తా అని మాయమాటలు చెబుతున్నారని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు పౌరుషం ఉందా అని సూటిగా ప్రశ్నించారు. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేశారని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పొత‍్తుకు తహతహలాడారని ఆమె ఎద్దేవా చేశారు. పిల్లి గట్టిగా అరిస్తే పులి అవుతుందా, పిల్లి పిల్లే..పులి పులే.. అని సింహం సింగిల్‌గానే వస్తుందని వైఎస్ షర్మిల అన్నారు. జగనన్న బంపర్ మెజార్టీతో గెలుస్తాడని దేశవ్యాప్తంగా సర్వేలు చెబుతున్నాయన‍్న ఆమె… అన్నకు ఒక అవకాశం ఇస్తే మళ్లీ రాజన్న రాజ్యం తెస్తారన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే మళ్లీ జగనన్న రావాలని ఆకాంక్షించారు. జగరబోయే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటువేసి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలారు రోశయ్యను ఆశీర్వదించాలని వైఎస్ షర‍్మిల కోరారు.
Tags 2019-elections tdp ys jagan ys sharmila ysrcp