రాజకీయాల్లో గుంటూరు జిల్లాది ప్రత్యేక స్థానం. రాజధాని నగరంగా నిర్మితమవుతున్న అమరావతి కేంద్రంగా ఉన్న ఈ జిల్లాలో ఆధిపత్యం సాధించేందుకు అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఒకనాడు పల్నాటి వీరగాథలకు ఆలవాలమైన గుంటూరు రాజకీయంగానే కాకుండా చరిత్ర పరంగానూ ప్రసిద్ధిగాంచింది..ఆచార్య ఎన్‌జీరంగా, కొత్తా రఘురామయ్య, చేబ్రోలు హనుమయ్య, నన్నపనేని వెంక్రటావు, దొడ్డపనేని ఇందిర, కాసు బ్రహ్మానంద రెడ్డి, నాదెండ్ల భాస్కరరావు, కొణిజేటి రోశయ్య, రాయపాటి సాంబశివరావు,కన్నా లక్ష్మీనారాయణ, కోడెల శివప్రసాద్, నాదెళ్ల భాస్కరరావు వంటి రాజకీయ ఉద్ధండులు ఈ జిల్లాలో ఉన్నారు. ఒకప్పుడు బుద్ధుడు నడయాడిన నేలలో ప్రస్తుత రాజకీయంపై దరువు రిపోర్ట్
జిల్లాలో పెదకూరపాడు, వేమూరు, రేపల్లె, తెనాలి, బాపట్ల, ప్రత్తిపాడు, గుంటూరు వెస్ట్, గుంటూరు సౌత్, చిలకలూరిపేట, తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకగవర్గాలు ఉండగా గుంటూరు, బాపట్ల పార్లమెంట్ స్థానాలున్నాయి. నవ్యాంధ్రకు కేంద్ర బిందువుగా ఉన్న ఈ జిల్లాలో పట్టు నిలుపుకునేందుకు అధికార, టీడీపీలు ఒకరిని ఒకరు దెబ్బకొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. నాదెండ్ల మనోహర్, రావెల కిశోర్ వంటి నేతలతో జనసేన కూడా కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఒకటి రెండు స్థానాల్లో త్రిముఖపోటీ కనిపించనుంది. గుంటూరుజిల్లా గతం నుంచీ టీడీపీకి కంచుకోటగా ఉంది. 2014 ఎన్నికల్లో 17 నియోజకవర్గాల్లో 12చోట్ల టీడీపీ గెలుపొందగా, 5చోట్ల వైసీపీ గెలిచింది. ఇప్పుడు లోకేశ్‌ను మంగళగిరి నుంచి బరిలో దించుతున్నారు.. మంగళగిరి నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపొందారు. రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడంతో జిల్లా వాసుల్లో టీడీపీ పట్ల కొంత సానుకూలత కనిపిస్తోంది. అయితే గత ఎన్నికల్లో ఎదురైన పరాభవాన్ని పూడ్చుకోవాలని వైసీపీ భావిస్తోంది. రాజధాని నిర్మాణంలో ఆలస్యం, అభివృద్ధి పనుల్లో అవినీతి సమస్యలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. జగన్ ప్రకటించిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసీపీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుని టీడీపీకి షాకివ్వాలన్నది వైసీపీ టార్గెట్‌గా తెలుస్తోంది. జిల్లాలో జనసేన పార్టీ ప్రభావం స్వల్పంగా కనిపిస్తోంది. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, గుంటూరు వెస్ట్ నుంచి తోట చంద్రశేఖర్, ప్రత్తిపాడు నుంచి రావెల కిషోర్‌బాబు, వేమూరు నుంచి డాక్టర్.ఎ.భరత్ భూషణ్ లు దిగుతుండగా, గుంటూరు నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ దిగుతున్నారు. ఈ సీట్లపై కాస్త ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీలు జిల్లాపై ఆధిపత్యం సంపాదించేందుకు వ్యూహరచనలు ప్రారంభించాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా 12 స్థానాలను కైవశం చేసుకుని తెలుగుదేశం పార్టీని రెండో స్థానంలోకి నెట్టేయాలని పావులు కదుపుతోంది.
నియోజవర్గాల వారీగా..
బాపట్ల నియోజకవర్గం సూర్యలంక బీచ్‌తో ప్రముఖ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతోంది. ఇక్కడ ప్రస్తుతం వైకాపా ఎమ్మెల్యే కోన రఘుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు. గాదె వెంకట రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి ఉద్దండులు ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ 9 సార్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్దులు గెలుపొందగా మూడు సార్లు మాత్రమే తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్దులు గెలుపొందారు. ప్రస్తుతం ఇక్కడ టీడీపీ నుండి అన్నం సతీష్ ప్రభాకర్ బరలోకి గుతున్నారు.
చిలకలూరిపేట నియోజకవర్గం నుండి ప్రస్తుతం రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావు శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇక్కడ 1989, 1999, 2009, 2014 ల్లో టీడీపీ గెలుపొందగా, 1994లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. 2004లో స్వతంత్ర అభ్యర్ధిగా మర్రి రాజశేఖర్ గెలుపొందారు. ప్రస్తుతం ఇక్కడ విడుదల రజనీ వైసీపీ అభ్యర్ధిగా నిలబడ్డారు. రజినీకి ప్రస్తుతం ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ తరపున ముస్తఫా ఎమ్మెల్యేగా ఉన్నారు. తూర్పు నియోజకవర్గం 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో కొత్త నియోజకవర్గంగా ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ తరపున మద్దాలి గిరిధర రావు బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉండడతో వైసీపీకి లాభిస్తోంది.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కూడా నియోజకవర్గ పునర్విభజన అనంతరం ఏర్పడిన మరో కొత్త నియోజకవర్గం. 2009 ఎన్నికల్లో ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందగా వైసీపీ తరపున చంద్రగిరి ఏసురత్నం, కన్నా, టీడీపీ నుంచి మహమ్మద్ నజీర్ లు బరిలోకి దిగుతున్నారు.
గురజాల నియోజకవర్గంలో 1952, 1972ల్లో సీపీఐ అభ్యర్దులు గెలుపొందగా 1962, 1989, 1999, 2004ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులు గెలుపొందారు. 1983లో మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్ధి జూలకంటి నాగిరెడ్డి గెలుపొందారు. 1985, 1994, 2009, 2014ల్లో టీడీపీ గెలుపొందింది. ప్రస్తుతం టీడీపీకి చెందిన యరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వైసీపీ తరపున మాజీ మంత్రి కాసు కృష్ణా రెడ్డి కుమారుడు కాసు మహేష్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. యరపతినేని అవినీతి పరుడిగా రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచగా మహేశ రెడ్డి యువకుడిగా బరిలోకి దిగుతున్నారు, కచ్చితంగా మహేశ రెడ్డి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మాచర్ల నియోజకవర్గంలో 1972లో స్వతంత్ర అభ్యర్ధి జూలకంటి నాగిరెడ్డి గెలుపొందగా, 1978, 1985, 2004, 2009ల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్దులు, 1983, 1989, 1994, 1999ల్లో టీడీపీ గెలుపొందింది. 2012లో జరిగిన ఉప ఎన్నికలతోపాటు 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి చెందిన పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి గెలిచారు. టీడీపీ తరపున అంజిరెడ్డి బరిలోకి దిగుతున్నారు.
మంగళగిరి నియోజకవర్గంలో 1952, 1962ల్లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ, 1994లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం, 1955, 1967, 1989, 1999, 2004, 2009ల్లో కాంగ్రెస్ పార్టీ, 1983, 1985ల్లో తెలుగుదేశం పార్టీలు గెలుపొందాయి. అయితే 1978లో మాత్రం జనతాపార్టీ అభ్యర్ధి జీవీ పాతయ్య గెలుపొందారు. ప్రస్తుతం ఇక్కడ వైసీపీ కి చెందిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి నారాలోకేశ్ బరిలోకి దిగుతున్నారు. పార్టీ అధినేత కుమారుడు కావడంతో టఫ్ సాగుతుందని అందరూ అనుకుంటుండగా ఆర్కే మాత్రే గెలుపు తనదేనంటున్నారు.
నర్సరావుపేట నియోజకవర్గం నుండి 1989, 1994, 1999ల్లో ప్రస్తుత శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు టీడీపీ నుండి గెలుపొందారు. 2004, 2009ల్లో కాసు వెంకట కృష్ణా రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందారు. ప్రస్తుతం ఇక్కడ వైసీపీ తరపున ప్రముఖ వైద్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి శాసనసభ్యుడిగా కొనసాగుతన్నారు. టీడీపీ డాక్టర్ అరవింద బాబు పోటీ చేస్తున్నారు.
పెదకూరపాడు నియోజకవర్గంలో 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కన్నా లక్ష్మీనారాయణ గెలుపొందారు. 2009, 2014ల్లో వరుసగా తెలుగుదేశం పార్టీకి చెందిన కొమ్మాలపాటి శ్రీధర్ గెలుపొందారు. వైసీపీ అభ్యర్థిగా నంబూరి శంకరరావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ టఫ్ జరిగే అవకాశముందట,,
పొన్నూరు నుంచి కేవలం 1989లో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చెందిన చిట్టినేని వెంకట్రావు గెలుపొందారు. 1983, 1994, 1999,2004, 2009, 2014ల్లో వరుసగా టీడీపీ గెలుపొందుతూ వస్తోంది. ఈసారి కూడా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకు వైసీపీ నుంచి రావి వెంకట రమణ పోటీకి రెడీ అవుతున్నారు. ఆచార్య ఎన్జీ రంగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇది. ఈసారి రావి వెంకటరమణ గెలిచే అవకాశముందని చెప్తున్నారు.
పత్తిపాడు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా ఉంది. 1989, 1994, 1999ల్లో మాకినేని పెదరత్తయ్య వరుసగా తెలుగుదేశం శాసనసభ్యుడిగా గెలుపొందారు. 2004, 2009ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందగా ప్రస్తుతం మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం జనసేన నుంచి బరిలోకి దిగుతుండగా టీడీపీనుంచి డొక్కా మాణిక్యవరప్రసాద్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత బరిలో దిగుతున్నారు.
రేపల్లె నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీకి చెందిన అనగాని సత్యప్రసాద్ శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు. 1962లో సీపీఐ, 1978లో సీపీఎం అభ్యర్థులు గెలుపొందారు. 1955, 1967, 1972,1983,1989, 2004, 2009ల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. 1985, 1994, 1999ల్లో టీడీపీ అభ్యర్దులు గెలుపొందారు. ప్రస్తుతం ఇక్కడ వైకాపా నుండి మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ బరిలో ఉన్నారు. ఇక్కడ రెండు పార్టీలకు సమాన బలం ఉంది. ప్రజల్లో ఎమ్మెల్యే పట్ల పెద్దగా అసంతృప్తి లేకపోయినప్పటికీ ఆయన అనుచరులపై మాత్రం మడ అడవుల ఆక్రమన, ఇసుక దందాల వంటి ఆరోపణలు ఉన్నాయి. దీంతో మోపిదేవి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ జనసేనకు కూడా మంచి బలం ఉంది.
సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ప్రస్తుతం శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ శాసనసభ్యుడిగా ఉన్నారు. 1989, 2004, 2009ల్లో కాంగ్రెస్ పార్టీ, 1994లో సీపీఐ(ఎం), 1999లో టీడీపీ గెలుపొందాయి. వైసీపీ నుంచి అంబటి రాంబాబు రేసులో ఉన్నారు. అంబటి రాంబాబు వైసీపీ అగ్రనేతల్లో ఒకరిగా ఉన్నారు. వైసీపీని కోడెల అసెంబ్లీలో అణచివేసిన విధానం, ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలతో అంబటి రాంబాబు భారీ మెజారిటీతో గెలుస్తారని తెలుస్తోంది.
తాడికొండ నియోజకవర్గం ప్రస్తుతం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా ఉంది. 1989, 2004, 2009ల్లో కాంగ్రెస్ పార్టీ, 1994లో సీపీఐ పార్టీలకు చెందిన అభ్యర్దులు గెలుపొందగా 1999, 2014ల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులు గెలుపొందారు. ప్రస్తుతం టీడీపీ తరపున శ్రీరాం మాల్యాద్రి, వైసీపీ తరపున శ్రీదేవి బరిలోకకి దిగుతున్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలిచే అవకాశం కనిపిస్తోందట.
తెనాలి నియోజకవర్గం నుంచి 1952, 1955, 1957, 1962, 1967, 1989, 2004, 2009ల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్దులు గెలుపొందారు. 1978లో మాత్రం జనతాపార్టీకి చెందిన దొడ్డపనేని ఇందిర గెలుపొందారు. 1983,1985,1994,1999,2014ల్లో టీడీపీ గెలుపొందింది. ప్రస్తుతం ఇక్కడ టీడీపీకి చెందిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వైసీపీ నుండి అన్నాబత్తుని శివకుమార్, నాదెండ్ల మనోహర్ జనసేన తరపున బరిలో నిలిచిన నేపధ్యంలో త్రిముఖ పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది.
వేమూరు నియోజకవర్గం ప్రస్తుతం ఎస్సీ రిజర్వు నియోజకవర్గంగా ఉంది. ప్రస్తుతం ఇక్కడ రాష్ట్ర మంత్రి నక్కా ఆనంద బాబు శాసనసభ్యుడిగా ఉన్నారు. 1962, 1965, 1978,1989,2004ల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా, 1967, 1972ల్లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధి యడ్లపాటి వెంకట్రావు గెలుపొందారు. 1983, 1985, 1994, 1999, 2009, 2014ల్లో టీడీపీ గెలుపొందుతూ వస్తోంది. ప్రస్తుతం ఇక్కడ వైకాపా నుంచి ఆపార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు, మాజీ ఎస్సీఎస్టీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ మేరుగ నాగార్జున బరిలోకి దిగనున్నారు. ఇక్కడ కూడా జనసేనకు మంచి బలమైన కేడర్ ఉంది. అయితే వీరు వైసీపీకి పార్టీకి అతీతంగా మద్దతిస్తున్నారు.
వినుకొండ నియోజకవర్గం నుంచి 1989, 2004ల్లో కాంగ్రెస్ అభ్యర్దులు గెలుపొందగా, 1994లో స్వతంత్ర అభ్యర్ధి వీరపనేని యలమందా రావు గెలుపొందారు. 1999, 2009, 2014ల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. ప్రస్తుతం ఇక్కడ టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక వైకాపా నుండి బొల్లా బ్రహ్మనాయుడు బరిలో ఉన్నారు. ఆంజనేయులు కనీసం మంచినీటి సమస్యకూడా తీర్చకపోవడం, అవినీతి ఆరోపణలతో పాటు బొల్లన్న సొంత డబ్బుతో చేసిన అభివృద్ధి, బొల్లన్న జాబ్ మేళాలు పెట్టి తన నియోజకవర్గ యువతకు ఉద్యోగాల కల్పన, గ్రామాల్లో మంచినీటి సరఫరా వంటి కార్యక్రమాలు చేపట్టడంతో వైసీపీ అభ్యర్ధి బొల్లా బ్రహ్మనాయుడు భారీ మెజార్టీతో గెలిచే అవకాశముందని తెలుస్తోంది