విజయనగరం జిల్లా అంటే రాజులు గుర్తొస్తారు.. విజయనగరం రాజులు, బొబ్బిలి రాజులు, మరో వైపు కురుపాం రాజులు ఇలా రాజుల ఏలుబడిలో శతాబ్దాలుగానడిచిన జిల్లా విజయనగరం. ప్రజాస్వామ్యం ఎంత వికసించినా ఈ ప్రాంతంలో రాజులపై ప్రేమాభిమానాలు దక్కలేదు.. కాలక్రమేణా ఎన్నికల్లోనూ అది కనిపిస్తుంది. మరి ఈ రాజులకోటలో రాజకీయం ఈ ఎన్నికల్లో ఎలా ఉండబోతుందో దరువు రిపోర్ట్….తాను చేసిన సుదీర్ఘ పాదయాత్రతోనే టీడీపీ కోటను బద్దలు కొట్టేందుకు జగన్ సిద్ధమైపోయారు. గతంలో ఆయన విశాఖ పాదయాత్రలో ఉండగానే కోటలో రాజకీయాన్ని వైసీపీ వైపు తిప్పుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీలలో పనిచేసిన పట్టున్న నాయకుడు రఘురాజును చేర్చుకున్నారు. అలాగే విజయనగరం జిల్లా అనగానే సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గుర్తుకు వస్తారు. ఓడిపోయినా తన పట్టును గట్టిగా నిలుపుకుంటూ వస్తున్న నేతగా ఉన్నారు. మరో వైపు పూసపాటి వంశీకుడు అశోక్ దూకుడుకు ఎప్పటికపుడు కళ్లెంవ వేయడంతోపాటు బొబ్బిలి రాజులను మరో చేత్తో నిలువరిస్తున్నారు. సహజంగానే జిల్లా రాజకీయాలు గందరగోళంలో ఉన్నాయి. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రస్తుత మున్న ఎమ్మెల్యేలో సగం మందికి పైబడి సిట్టింగ్‌లకు ఈసారి పోటీచేసే అవకాశం రాలేదు. ఈ సారి గజపతినగరం, చీపురుపల్లి సాలూరు స్థానాల్లో రెండు పార్టీలకూ గట్టిపోటీ నెలకొనే అవకాశముంది. కురుపాం, పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట
ఇక లోక్‌సభ నియోజకవర్గం చూస్తే..
గత ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పైచేయి సాధించింది. మొత్తం 9 స్థానాలకు గాను 6 చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలుపొందగా, వైసీపీ మూడు స్థానాలను సొంతం చేసుకుంది. పార్వతీపురం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట నియోజకవర్గాలను టీడీపీ గెలుచుకోగా.. కురుపాం, సాలూరు, బొబ్బిలి స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. వైసీపీ నుంచి గెలిచిన సుజయ్ కృష్ణ రంగారావు టీడీపీలో చేరారు. అయితే ఆనంద గజపతిరాజు కుటుంబం మినహా మిగిలిన రాజవంశీయులంతా దాదాపుగా టీడీపీలోనే ఉన్నారు. దీంతో వర్గపోరు కూడా పెరిగింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌లో ఉన్న వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ప్రస్తుతం టీడీపీలో చేరి అరకు లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. కానీ రాజులిద్దరూ కలిసి పనిచేస్తేనే ఇది సాధ్యం. ఎందుకంటే కురుపాంలో మొదటి నుంచి వైరిచర్ల, శత్రుచర్ల మధ్య వైరం ఉంది. ఒకే పార్టీలో ఉన్నా శత్రుచర్ల, వైరిచర్ల మధ్య అంతగా పొసగదు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు రాష్ట్ర మంత్రిగా శత్రుచర్ల, కేంద్ర మంత్రిగా వైరిచర్ల పదవీ బాధ్యతలు చేపట్టినా కలిసి పనిచేసిన దాఖలాలు లేవు. అనుచరుల్లో కూడా విభేదాలున్నాయి. ఇదిలా ఉంటే బొత్స కుటుంబం ఈసారి గట్టి పోటీని ఇచ్చేలా కనిపిస్తోంది. ఎందుకంటే బొత్స ఫ్యామిలీ ఇప్పుడు వైసీపీలో ఉంది. చీపురుపల్లి నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, గజపతినగరం నుంచి బొత్స అప్పల నర్సయ్య, నెల్లిమర్ల నుంచి బడుకొండ అప్పలనాయుడు వైసీపీ తరఫున బరిలోకి దిగుతున్నారు. కాబట్టి గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి టీడీపీకి గట్టి పోటీ తప్పదు.
ఇక విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీ 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగి మూడో స్థానంలో నిలిచారు. అశోక్ గజపతిరాజు గెలుపొందారు. వైసీపీ రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈసారి ఝాన్సీ వైసీపీ నుంచి పోటీకి దిగుతున్నారు. కాబట్టి అశోక్ గజపతిరాజుకు గట్టిపోటీ తప్పదు. గత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఈ రెండు పార్టీలతో పాటు జనసేన కూడా జాబితాలో చేరుతోంది. కానీ, జనసేన పెద్దగా ప్రభావం చూపించలేకపోవచ్చనేది విశ్లేషకుల మాట. విజయనగరం జిల్లాలో పవన్ కళ్యాణ్‌కు అభిమాన గణం భారీగానే ఉన్నా.. అది ఎన్నికలకు పనిచేయదని అంటున్నారు. ఇక కాంగ్రెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిన కాంగ్రెస్.. ఈసారి కూడా పుంజుకోవడం అసాధ్యం. కాబట్టి విజయనగరం జిల్లాలో ముఖ్యంగా టీడీపీ, వైసీపీ మధ్యే రసవత్తర పోరు జరగనుంది.
మరోవైపు జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుతోంది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా నేతలు ఎవరికి వారే ఆధిపత్యం కోసం పాకులాడటంతో టీడీపీ గందరగోళ పరిస్థితి ఎదుర్కొంటుంది. ఒకప్పుడు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ కేంద్రమంత్రి ఎంపీ పూసపాటి అశోక్ గజపతిరాజు కనుసన్నుల్లో నడిచే తెలుగుదేశం పార్టీ ఆయన కాస్త స్థబ్ధుగా ఉండటంతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మెుదలయ్యాయి. మంత్రి సుజయ్ కృష్ణ రంగరావు ఒక వర్గంగా జిల్లా ఇంచార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు మరో వర్గంగా, అశోక్ గజపతిరాజు వర్గీయులు మరో వర్గంగా విడిపోవడంతో జిల్లాలో సైకిల్ ముక్కలు ముక్కలవుతోంది. అసలు గతంనుంచే పూసపాటి అశోక్ గజపతిరాజుకు, బొబ్బిలి రాజవంశీయులైన సుజయ్ కృష్ణ రంగరావులకు ఎప్పుడూ పొసగదు. బొబ్బిలి యుద్ధం నాటినుంచే పూసపాటి, బొబ్బిలి వంశీయులు ఉప్పునిప్పులా ఉంటారు. జిల్లాకు చెందిన విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత, గజపతినగరం ఎమ్మెల్యే కేఏ నాయుడు, నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడు, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణిలను ఎవరికి వారే తమవైపుకు తిప్పుకుని వర్గరాజకీయాలు చేస్తున్నారు. గతంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక విషయంలో వర్గపోరు బట్టబయలవడంతో నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. ఎన్నికల సమీపించినా కూడా వర్గాలుగా విడిపోయిన నేతలకు తాము ఎవరిని పలుకరిస్తే ఏ వర్గానికి అంటకట్టి దూరం పెడతారోనని అంతర్మధనం చెందుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దిశానిర్దేశం చెయ్యాల్సిన నేతలు వర్గపోరును ప్రోత్సహించడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎంపీతోపాటు 6అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.