ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. టీడీపీకి రాజీనామా చేసిన వైసీపీలో చేరదామన్న తన కార్యకర్తల నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. వైఎస్ జగన్ తమకు ఎలాంటి అన్యాయం చేయలేదని, తామే పార్టీ మారి అన్యాయం చేశామని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. తప్పు తెలుసుకున్నామని, చంద్రబాబు మోసాన్ని, టీడీపీ విధి విధానాలను ఎండగడతామని ఆయన తెలిపారు.
కర్నూలులో వైసీపీ అభ్యర్థి హఫీజ్ ఖాన్‌ను గెలిపించుకుని ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ని ముఖ్యమంత్రిని చేసుకుందామని ఎస్వీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కర్నూలులో తన సత్తా ఏంటో చూపిస్తానని, తన పోరాటం, సవాల్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి, టీజీ వెంకటేష్ కుటుంబాలకు వ్యతిరేకంగా ఎస్వీ కుటుంబం తరఫున ఢీ కొడతానని అన్నారు. వాళ్లు ఎంతమంది ఉన్నా భయపడేది లేదని, తమపై కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు.
జరగబోయే ఎన్నికల్లో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకుని వైఎస్ జగన్‌కు బహుమతిగా ఇస్తామని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. తనకోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ తన వంతు కృషి చేస్తానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే అప్పట్లో పార్టీ మారానే కానీ, డబ్బులు, పదవులు కోసం పార్టీలు మారే సంస్కృతి కాదని అన్నారు. కాగా యూజ్ అండ్ త్రో పాలసీకి పెట్టింది పేరు అయిన చంద్రబాబు నాయుడు కర్నూలు టికెట్ ఇవ్వకుండా ఎస్వీ మోహన్‌రెడ్డికి మొండి చేయి చూపించిన విషయం తెలిసిందే