తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్తున్న ఎంపీల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే పార్టీ వీడిన ఎంపీలకు తోడుగా, మరో పార్లమెంటు సభ్యుడు తన పదవిని వీడారు. అలా రాజీనామా చేసింది నంద్యాల ఎంపీ ఎస్పీ వై రెడ్డి. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన నమ్మకద్రోహం ఫలితంగా తమ నాయకుడు పార్టీని వీడారని ఆయన అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు.
వైసీపీ తరఫున 2014 ఎన్నికల్లో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎస్పీవై రెడ్డి అనంతరం టీడీపీలో చేరారు. నంద్యాల నుంచి పోటీ చేసే అవకాశం ఈసారి తనకు ఖాయం అనుకుంటున్న తరుణంలో టీడీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు ఆయనకు షాకిచ్చారు. నంద్యాల ఎంపీ టికెట్‌ను మాండ్ర శివానంద్‌రెడ్డికి ఇచ్చారు. దీంతో టీడీపీ తనను మోసం చేసిందని ఆవేదన చెందడం ఎస్పీవై రెడ్డి వంతు అయింది. నంద్యాల నుంచి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు కార్యకర్తలకు వెల్లడించారు.
అయితే, ఈ సమయంలోనే జనసేన పార్టీ ఎంట్రీ ఇచ్చింది. తమ పార్టీలోకి వస్తే, ఎంపీ టికెట్ ఇస్తామని ఆఫర్ చేసింది. దీంతో, తన కుమార్తెతో కలిసి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను జనసేన కార్యాలయంలో ఎస్పీవై రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి పవన్ కల్యాణ్ ఆహ్వానించారు.