నామినేషన్లకు మరికొద్ది రోజులే సమయం ఉండడంతో రాష్ట్రంలో రాజకీయాలు గంటగంటకూ మారిపోతున్నాయి. ఇప్పటివరకు జనసేన కార్యకర్తగా కూడా లేని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నయ్య కొణిదెల నాగబాబు ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ సమక్షంలో నాగబాబు జనసేనలో చేరబోతున్నారు. ఇటీవల కొంతకాలం నుంచి యూట్యూబ్ చానెల్ ద్వారా జనసేనకు మద్దతుగా నాగబాబు పనిచేస్తున్నారు. తాను పార్టీలో లేకపోయినా తన తమ్ముడి గెలుపుకోసం కృషి చేస్తానని చెబుతూ వచ్చారు. అయితే ఇప్పుడు నేరుగా పార్టీలోకి ప్రవేశించి ప్రత్యక్షంగా జనసేన తరపున పనిచేయబోతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీగా పోటీ చేయబోతున్నారు. అయితే గతంలో అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేయాలని భావించినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల అది వీలు కాలేదు. కానీ, ఇప్పుడు తమ్ముడి పార్టీతో నాగబాబు తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
