ఏపీలో ప్రస్తుతం అధికార టీడీపీలో అసమ్మతి నేతల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. తాజాగా టీడీపీకి మరో షాక్ తగిలింది. అవనిగడ్డ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరిప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ జగన్ సమక్షంలో మంగళవారం మధ్యాహ్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. చంద్రబాబు తమకు గుర్తింపునివ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే టీడీపీని వీడుతున్నట్టు తెలిపారు. 2014 ఎన్నికల్లో తనను కాదని మండలి బుద్ధప్రసాద్‌కు టికెట్ ఇచ్చిన చంద్రబాబు.. ‘నీ బాధ్యత నేను తీసుకుంటా. తగిన ప్రాధాన్యం ఇస్తానని చెప్పి మోసం చేశాడు. మానసిక వేదనతోనే టీడీపీని వీడాను. వైసీపీలో చేరుతున్నందుకు సంతోషంగా ఉంది. వైఎస్ జగన్ అవనిగడ్డకు వస్తున్న నేపథ్యంలో ఆయన సమక్షంలో పార్టీలో చేరడం శుభపరిణామంగా భావిస్తున్నాను’ అని శ్రీహరి అన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి కృష్ణా జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ ఎంపీ, దివంగత బ్రాహ్మణయ్య వారసుడు శ్రీహరి.
