కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజక వర్గంలో టీడీపీలో టికెట్ల రగడ మొదలైంది. ఎమ్మెల్యే టికెట్‌ను లింగారెడ్డికి ఇవ్వడంతో.. వరదరాజులరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడికి అన్యాయం జరిగిందంటూ వరదరాజులరెడ్డి వర్గీయులు కూడా తమ నిరసన తెలుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర ఫ్లెక్సీలను తొలగించారు. పార్టీ కార్యాలయానికి నల్లజెండాలు కట్టి తమ నిరసన తెలిపారు. ఐదేళ్లుగా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జిగా వరదరాజులరెడ్డి ఉండగా.. టికెట్‌ను లింగారెడ్డికి కేటాయించడంతో వరద వర్గీయులు అధిష్టానంపై మండిపడుతున్నారు. ఈ పరిణామాలతో వరదరాజులరెడ్డి ఆయన అనుచరులతో సమావేశమై చర్చలు జరిపారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కార్యకర్తలు, అభిమానుల సూచన మేరకు నిర్ణయం తీసుకుంటామని వరదరాజులరెడ్డి తెలిపారు. అయితే ఏపీలో ఫ్యాన్ గాలి వీస్తుండడంతో ఖచ్చితంగా వైసీపీలోకి చేరి టీడీపీని దెబ్బకు దెబ్బ కొట్టాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
