దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి అకాల మరణంతో కడప జిల్లాతో పాటు, వైఎస్సార్ కుటుంబ అభిమానుల్లో విషాద ఛాయలు నింపింది. ఈ ఘటనపై ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తలపై గాయం ఉండటం, చనిపోయిన సమయంలో వివేకా ఒంటరిగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వివేకానందరెడ్డి భౌతికకాయానికి పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. గురువారం ప్రచారం ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చిన ఆయన భోజనం చేసిన తర్వాత ఒక్కరే ఇంట్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో బాత్‌రూంలో రక్తపు మడుగులో పడిఉండటాన్ని పనివారు గుర్తించారు.
ఈ నేపథ్యంలో ఆయన అకాల మరణంపై అనుమానం వ్యక్తం అవుతోంది. అయితే పీఏ చెప్పిన వివరాల ప్రకారం ఇంటి వెనుక డోర్ తీసి ఉందని ఉదయం ఎంత తలుపు కొట్టినా తీయకపోవడంతో తాము వెనుక ద్వారం నుంచి లోపలికి వెళ్లామని బెడ్ రూం తలుపు తీసి ఉందని లోనికి వెళ్లగా 2లీటర్ల రక్తం ఉందని తెలిపారు. తర్వాత బాత్రూంలోపలికి వెళ్తే లోపల వివేకా చనిపోయి ఉన్నారని, శరీరం, తలపై బలమైన గాయాలతో వివేకా చనిపోయి ఉన్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు. అయితే కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు జాగిలాలతో ఏదైనా ఆధారాలు లభిస్తాయని దర్యాప్తు చేస్తున్నారు.