ఒంగోలు ఎంపీ సీటు ప్రకాశం జిల్లా టీడీపీలో అగ్గి రాజేస్తుంది. మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున బరిలో నిలిచేందుకు సిద్ధం కావడంతో టీడీపీలో తలనొప్పులు మొదలయ్యాయి. ఒంగోలు పార్లమెంట్ స్థానానికి అభ్యర్థి ఎంపికలో రగులుతున్న రగడ ఎవరో ఒకరిని పార్టీ నుంచి సాగనంపేదాకా చల్లారేలా కనిపించడం లేదు.
మంత్రి శిద్దా రాఘవరావును పోటీ చేయమని అధినేత ఆదేశించినా ఆయన దర్శి స్థానం నుంచి తప్ప మరెక్కడ పోటీ చేయడానికి సిద్ధంగా లేనని తెగేసి చెప్పారు. పార్టీలో ఇటీవీల చేరిన ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని కోరినా ఆయనా అందుకు ఆసక్తిగా లేరు. కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావును దర్శి నుంచి పోటీ చేయించి శిద్దాను ఒంగోలు ఎంపీగా, ఉగ్రను కనిగిరి ఎమ్మెల్యేగా బరిలో నిలిపేందుకు చంద్రబాబు నాయకులను సిద్ధం చేస్తున్నా వారెవరూ బాబు మాట వినే పరిస్థితులు కనిపించడం లేదు. ఒకేవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేయాల్సి వస్తే పార్టీ నుంచి బయటకు వెళ్లడానికి కూడా శిద్దా రాఘవరావు సిద్ధమవుతున్నారు.
రెడ్లు ఓటు బ్యాంకు అధికంగా ఉండే ఒంగోలు స్థానం నుంచి తనను బరిలో దింపి చంద్రబాబు బలి చేయాలని చూస్తున్నాడని శిద్దా సన్నిహితుల వద్ద వాపోతున్నాడు. ఈ నేపథ్యంలో చివరి ప్రయత్నంగా తన అనుచరులతో అమరావతిలో నిరసన చేయించాలని శిద్దా నిర్ణయించారు. అయినా చంద్రబాబు వెనక్కి తగ్గకపోతే తానే పార్టీ నుంచి బయటకు వచ్చేయాలని ముఖ్య అనుచరులతో చెప్పుకుని బాధపడిపోయారు.