తెలుగు దేశం పార్టీని 30 ఏళ్లుగా భుజాలపై మోసి అలసిపోయామని, అయినా చంద్రబాబుకు తాము అంటే చులకనగా ఉందని ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి మూడు దశాబ్ధాలకాలంపాటు ఎనలేని సేవలందించి వెన్నుదన్నుగా నిలిచిన పర్వత కుటుంబం టీడీపీని వీడేందుకు నిర్ణయించుకుంది. దివంగత మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉండగానే హఠాత్తుగా మరణించారు. ఆయన పార్టీకి ఎంతో సేవ చేశారు. ఆ కుటుంబానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ, అన్నవరం దేవస్థానం పాలకమండలి సభ్యుడు పర్వత రాజబాబు, ఆయన సతీమణి జానకీదేవి తదితరులు ఇప్పుడు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నట్లు మంగళవారం ప్రకటించారు. దీంతో ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పర్వత అభిమానులు, కార్యకర్తల్లో ఈ నిర్ణయం దిగ్ర్భాంతికరంగా మారింది.
ఇప్పటివరకు వీరి కుటుంబంనుంచి నలుగురు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా పనిచేశారు. టీడీపీ ఆవిర్భావం కాకముందు పర్వత గుర్రాజు ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. టీడీపీ తరపున పర్వత సుబ్బారావు, పర్వత చిట్టిబాబు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ ప్రత్తిపాడు టిక్కెట్టు కోసం మాజీ ఎమ్మెల్యే బాపనమ్మ, కూమారుడు రాజబాబు, కోడలు జానకిదేవి సీఎం చంద్రబాబును కలిసి విన్నవించారు. కానీ వారికి ఆ హామీ లభించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీకి రాజీనామా చేస్తున్నామని, వైసీపీలోకి చేరడానికి నిర్ణయించుకున్నామని రాజబాబు తెలిపారు.