2014 ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకుని ఈసారి అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. అభ్యర్థుల జాబితా ఖరారు సమయంలోనే వైసీపీలోకి వలసలు పెరిగిపోతున్నాయి. అయితే వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ జగన్ ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. మొత్తం 13 జిల్లాల్లో పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. మంగళవారం ఆయన పార్టీ సీనియర్ నేతలతో తన ఎన్నికల ప్రచార పర్యటనతో పాటుగా అభ్యర్థుల ఎంపికపై విస్తృతంగా చర్చలు జరిపారు. జగన్ ఎన్నికల ప్రచారయాత్రను పెనుగొండ, గాజువాక లేదా గురజాలలో ఏదో ఒక చోట నుంచి ప్రారంభించాలనే ప్రతిపాదనలు సమావేశంలో వచ్చినట్లు తెలిసింది. బుధవారం మళ్లీ జరిగే సమావేశంలో ప్రచార షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. సమావేశంలో పార్టీ నేతలు వి.విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, తలశిల రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.
