ఔను. ఏపీ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరుతో ఇలా దరఖాస్తు వచ్చింది. నా ఓటు తొలగించేయండి అంటూ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం ఓటర్ల జాబితాలో ఉన్న జగన్ ఓటు తొలగించాలంటూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు వచ్చింది. ఈ విషయాన్ని పులివెందుల ఓటు నమోదు అధికారి సాకే సత్యం మంగళవారం విలేఖరులకు తెలిపారు. జగన్మోహన్‌రెడ్డి ఓటు తొలగించాలంటూ ఫారం-7 ఆన్‌లైన్‌లో వచ్చిందని ఆయన వెల్లడించారు.
పులివెందుల పట్టణం బాకరాపురంలోని 134 పోలింగ్ కేంద్రంలో 788 నెంబరు ఓటు వైయస్ జగన్మోహన్‌రెడ్డి పేర నమోదైందన్నారు. ఈ ఓటు తొలగించాలంటూ ఫారం-7 ఆన్‌లైన్‌లో వచ్చిందన్నారు. ఈ విషయంపై వైయస్ జగన్మోమోహన్‌రెడ్డితో మాట్లాడడానికి అధికారులు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదన్నారు. దీంతో జగన్ సమీప బంధువు జనార్ధన్‌రెడ్డితో చర్చించి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై విచారణ జరుపుతామని, ఫారం-7 ఎవరు నమోదు చేశారో నిగ్గుతేల్చి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
స్థూలంగా వైసీపీ ఆరోపించిందే నిజమైంది. ఓట్ల తొలగిపులో టీడీపీ పెద్ద ఎత్తున కుట్ర చేస్తోందని, ఇందుకోసం కడప జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టిందనేది నిజమని తేలింది. ఏకంగా ప్రతిపక్ష నేత ఓటుకే ఎసరు వచ్చింది. ఈ నిస్సిగ్గు చర్యను టీడీపీ ఎలా సమర్థించుకుంటుందో చూడాలి మరి.