కర్నూల్ జిల్లాలోని బనగానపల్లి నియోజకవర్గంలో ఏప్రీల్ 11న జరిగే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి జెండా ఎగురవేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థల మాజీ ఛైర్మన్, వైసీపీ నాయకుడు చల్లా రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వైసీపీలో చేరిన తరువాత ఆయన బనగానపల్లికి చేరుకోవడంతో ఆయనకు పెద్దఎత్తున కార్యకర్తలు స్వాగతం పలికారు. పట్టణంలోని పెట్రోల్ బంకు కూడలిలో వైసీపీ ఇన్‌ఛార్జి కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాజన్న రాజ్యం రావాలంటే జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ప్రజలకు సూచించారు. గతంలో జరిగిన తప్పులకు ప్రజలు మన్నించాలని కోరారు. అంతేకాదు కర్నూల్ జిల్లాలో మొత్తం 14 సీట్లు గెలిపించి జగన్ కానుకగా ఇస్తామన్నారు. కాటసాని కుటుంబానికి పెద్దన్నలా వ్యవహరించి రామిరెడ్డి గెలుపునకు కృషిచేస్తానన్నారు. అంతకుముందు కాటసాని రామిరెడ్డి వైసీపీ చేరిన ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలో ఉన్న టీడీపీ నాయకుల మోసపూరిత మాటలు నమ్మవద్దని కార్యకర్తలకు సూచించారు. అనంతరం వైసీపీ నాయకుడు యర్రబోతుల వెంకటరెడ్డి మాట్లాడారు. అంతకుముందు వైసీపీ శ్రేణులు గోవిందిన్నె గ్రామం చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు. మార్గమధ్యంలో హుసేనాపురం, యనకండ్ల గ్రామాల్లో కార్యకర్తలు చల్లాకు పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. బనగానపల్లి నుంచి అవుకు మెట్ట వరకు రోడ్‌షో నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు చల్లా భగీరథరెడ్డి, కాటసాని ఓబుల్‌రెడ్డి, కాటసాని సోదరులు తిరుపాల్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, కర్రా హర్షవర్దన్‌రెడ్డి, గుండం శేషిరెడ్డి, గుండం నాగేశ్వరరెడ్డి, యర్రబోతుల ఉదయ్ భాస్కర్‌రెడ్డి, కాట్రెడి మల్లికార్జునరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, గుండం సూర్యప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు.
