సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు కౌంట్ డౌన్ మొదలయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు షాకుల పరంపర తగ్గడం లేదు. ఆ పార్టీని వీడుతున్న ముఖ్యనేతల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా సిట్టింగ్ ఎంపీ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం సహా ఆయన కుటుంబం అంతా పార్టీని వీడేందుకు సిద్ధమైంది. గత కొద్దికాలం క్రితం నరసింహ ఆరోగ్యం బాగ లేదనే వార్తలు వచ్చాయి. దీంతో అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఆయన కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన ఆరోగ్యం సహకరించనందున తన కుటుంబంలో ఎవరో ఒకరికి జగ్గంపేట అసెంబ్లీ సీటు అడిగానని.. ఆలోచించి చెబుతానని సీఎం చెప్పారని తెలిపారు. గతంలో జగ్గంపేట నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని.. తన అనుచరులంతా జగ్గంపేటలోనే ఉన్నారని ఆయన చెప్పారు.
అయితే, చంద్రబాబు మాత్రం సిట్టింగ్ ఎంపీ ప్రతిపాదనను పక్కనపెట్టేశారు. దీంతో తోట నరసింహం కుటుంబం తనదారి తాను చూసుకోవాలని నిర్ణయించుకుంది. పార్టీ మార్పు వార్తలపై తోట నరసింహం భార్య తోట వాణి మీడియాతో మాట్లాడుతూ… తోట నరసింహం 15 ఏళ్లుగా జిల్లాలోకు ఎంతో సేవచేశారని… అయినా, పార్టీ అధిష్ఠానం మమ్మల్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. తన భర్తకు జిల్లాలో సముచితస్థానం ఇవ్వకుండా అడ్డుపడింది హోంమంత్రి చినరాజప్పే అని ఆరోపించారు. అందుకే తాము పార్టీ మారాల్సి వస్తోందని క్లారిటీ ఇచ్చారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నామని… రేపు వైఎస్ జగన్ సమోంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతామని తెలిపారు. తాను పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని వెల్లడించిన తోట వాణి… గెలుపు మాదేనని ధీమా వ్యక్తం చేశారు. తోట దంపతుల నిర్ణయంతో టీడీపీకి మరో భారీ షాక్ తగిలిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.